ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అణచివేస్తున్నారు
ముగ్గురు వ్యక్తుల కోసం ఇద్దరు నియంతృత్వ పాలన సాగిస్తున్నారు
కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ ధ్వజం
న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పెట్రోలు,నిత్యావసరాల ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ శుక్రవారంనుంచి దేశవ్యాప్తంగా 11 రోజుల పాటు ఆందోళనలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఢిల్లీలో ఎఐసిసి కార్యాలయం వద్ద రాహుల్ గాంధీ, ఇతర పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి కేంద్రప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. విపక్షాలపై ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్న తీరు నియంతృత్వ పాలన ప్రారంభాన్ని సూచిస్తోందని రాహుల్ మండిపడ్డారు. ‘ ధరల పెరుగుదల, నిరుద్యోగం, సమాజంలో చోటు చేసుకుంటున్న హింస వంటి ప్రజా సమస్యలను ఎవరూ లేవనెత్తకూడదు. వాటిని ప్రశ్నిస్తే అణచి వేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా దర్యాప్తు సంస్థలతో దాడులు చేస్తున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యం లేదు. దశాబ్దాల క్రితం ఒక్కో ఇటుక పేర్చి ఏర్పర్చుకున్న ప్రజాస్వామ్యాన్ని మన కళ్ల ముందే కూల్చి వేస్తున్నారు. ఈ వ్యవహార శైలి .. నియంతృత్వ పాలన ప్రారంభానికి సూచన. నలుగురైదుగురి ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ ప్రభుత్వం నడుస్తోంది. ఇద్దరు, ముగ్గురు వ్యాపారులకోసం ఇద్దరు వ్యక్తులు నియంతృత్వ పాలనకు పాల్పడుతున్నారు. నేను ఇలా ఎంత ఎక్కువ ప్రశ్నిస్తే .. నాపై అంత ఎక్కువ దాడి జరుగుతుంది’ అని రాహుల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘నా సమస్య ఏమిటంటే నేను నిజం మాట్లాడుతాను. నేను దేనికీ భయపడను. నేను ధరల పెరుగుదల సమస్యను లేవనెత్తితే నాపై మరింతగా దాడి జరుగుతుంది. అయితే ఎవరైతే బెదిరిస్తారో వారే భయపడుతుంటారు’అని ఆయన అన్నారు. రాజకీయ వ్యక్తులు తనపై దాడి చేస్తే తాను ఎక్కువ సంతోషిస్తానని కూడా ఆయన అన్నారు.
ఆమె ఒక మౌత్‌పీస్
కాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక మౌత్‌పీస్‌అని, దేశ ఆర్థిక వ్యవస్థలో ఏం జరుగుతోందో ఆమెకు అవగాహన ఉందని తాను అనుకోవడం లేదని రాహుల్ అన్నారు.
ఇది కుటుంబం కాదు.. ఒక ఐడియాలజీ
‘ఆర్‌ఎస్‌ఎస్ ఐడియాలజీని నేను వ్యతిరేకిస్తాను. నా కుటుంబం ప్రాణత్యాగాలు చేసింది. సిద్ధాంతం కోసం పోరాడినప్పుడు ఇది మా బాధ్యత. ఇది ఒక కుటుంబం కాదు.. ఒక ఐడియాలజీ. హిట్లర్ కూడా ఎన్నికల్లో గెలిచే వాడు. ప్రతిసారి ఆయన ఎన్నికల్లో విజయం సాధించే వాడు. జర్మనీ వ్యవస్థలన్నిటినీ తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. మొత్తం వ్యవస్థలను నాకు అప్పగించండి. ఎన్నికల్లో ఎలా గెలుసున్నారో చూపిస్తాను’ అని రాహుల్ అన్నారు.