కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : విద్వేష నేరాల నియంత్రణకు సుప్రీం కోర్టు ఆదేశాలతో రూపొందించిన సమగ్ర మార్గదర్శకాలు క్రైస్తవ సంస్థలపై దాడులకు కూడా వర్తిస్తాయా అని కేంద్ర ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. గత కొన్నేళ్లుగా క్రైస్తవ సంస్థలపై దాడులు ఎక్కువయ్యాయంటూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ పిల్‌ను బెంగళూరు ఆర్చ్‌బిషప్ పీటర్ మచదో దాఖలు చేశారు. నేషనల్ సాలిడారిటీ ఫోరం, ఎవాంజికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియాలతో కలిసి ఉమ్మడిగా దాఖలు చేశారు.
క్రిస్టియన్ సంస్థలపై దాడుల నియంత్రణ, భద్రత చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన బెంచ్ ఈ మేరకు కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ న్యాయవాది కాను అగర్వాల్ అడ్డు తగిలారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినకుండా నోటీసులు జారీ చేయవద్దని ఆయన కోరారు. కొద్ది సేపటి తర్వాత తుషార్ మెహతా వర్చువల్‌గా కోర్టుకు హాజరయ్యారు. ఈ పిల్‌కు సంబంధించిన సమాచారం కేంద్రం సమర్పిస్తుందని చెప్పారు. 2018లో సుప్రీం కోర్టు ఆదేశాలతో రూపొందిన సమగ్ర మార్గదర్శకాలు ప్రస్తుత కేసుకు వర్తిస్తాయా లేదా అని చెప్పాలని పేర్కొంది.