న్యూఢిల్లీ: భారత్‌లో పార్లమెంటు సరిగ్గా పనిచేయడంలేదు, ప్రజాస్వామ్యం ఉక్కిరిబిక్కిరి అవుతోంది, అన్ని రాజ్యాంగ సంస్థలను చెప్పుచేతుల్లోకి తీసేసుకున్నారన్న ముగింపుకు తానొస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పి. చిదంబరం అన్నారు. గత వారం విపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేను ఈడి సమ్మన్ చేసినప్పుడు రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు ఆయన్ని కాపాడడంలో విఫలమయ్యారని కూడా అన్నారు. శుక్రవారం రామ మందిరం శంకుస్థాపన రోజు(ఫౌండేషన్ డే)న ధరల పెరుగుదలపై, నిరుద్యోగంపై కాంగ్రెస్ నిరసనలు ప్రదర్శించి ‘శిలాన్యాస్’ ఆలోచనల నుంచి దృష్టి మళ్లించిందని హోం మంత్రి అమిత్ షా అనడాన్ని చిదంబరం కొట్టిపారేశారు. ‘మేము ద్రవ్యోల్బణం,నిరుద్యోగం, అగ్నిపథ్ స్కీమ్‌లపై ఆగస్టు 5న నిరసనలు తెలుపుతామని ముందే ప్రకటించాం. కానీ వారు వినిపించుకోకుంటే మేమేమి చేసేది?’ అని చిదంబరం ప్రశ్నించారు. ‘రూల్ 267 కింద ధరల పెరుగుదలపై మొదటి రోజున చర్చిస్తే ఏం మునిగిపోయేదని? ఆ చర్చ ఒక్క రోజులోనే ముగిసిపోయేది కదా! కానీ వారు రెండు వారాలు వృథా చేసేశారు’ అని ఆయన ఖేదాన్ని వ్యక్తం చేశారు.
పార్లమెంటులో ధరలపై చర్చ జరపమని కోరితే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత్‌కు మాంద్యం(రిసెషన్, స్టాగ్‌ఫ్లేషన్) ముప్పేమి లేదని, భారత్ మాక్రో ఎకనామీ ఫండమెంటల్స్ పర్‌ఫెక్ట్‌గా ఉన్నాయనడాన్ని చిదంబరం ఎద్దేవా చేశారు. ధరల పెరగుదల, నిరుద్యోగం అనే రెండు విషయాలపై కాంగ్రెస్ అడిగితే మసిపూసి మారెడు కాయ చేశారని అన్నారు. ఇతర దేశాలతో ఆర్థిక వ్యవస్థను పోల్చడం విచిత్రంగా ఉందన్నారు. ‘ద్రవ్యోల్బణంకు ఆదాయం, పొదుపుకు ఎల్లప్పుడూ లంకె ఉంది. ఒకవేళ అమెరికాలో ద్రవ్యోల్బణం ఎక్కువ ఉంటే …వారి తలసరి ఆదాయం కూడా ఎక్కువ ఉందనేది దృష్టిలో పెట్టుకోవాలి. భారత్‌లో తలసరి ఆదాయం(2000 డాలర్ల కన్నా తక్కువ)గా ఉంది. తక్కువ పొదుపు, ద్రవ్యోల్బణం పెరగడం ప్రజలకు భరించరానివిగా తయారయ్యాయి’ అని చెప్పుకొచ్చారు. అమెరికా, భారత్‌ల మధ్య ఉన్న పెను తేడాలను ఆర్థిక మంత్రి సీతారామన్ పరిగణనలోకి తీసుకోనేలేదని ఆయన విమర్శించారు. ‘భారత్‌లో ఓ రోగి 102 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నాడంటే, అమెరికాలోని రోగి 103 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నాడని జవాబిస్తే సంతృప్తికరంగా ఉంటుందా? ఇద్దరు రోగులు జ్వరంతో ఉన్నాంటే సరిపోతుందా’ అని ఆయన అన్నారు.