న్యూఢిల్లీ: డ్రాగన్ ఆధిపత్యానికి చెక్ పెట్టే దిశగా టెక్ దిగ్గజం ఆపిల్ అడుగులేస్తున్నది. వచ్చేనెలలో మార్కెట్లోకి తీసుకురానున్న ఐ-ఫోన్14 ఫోన్‌ను చైనాతోపాటు భారత్‌లోనూ ఉత్పత్తి చేయాలని ఆపిల్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. ఇటీవలి భౌగోళిక, -రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాపై ఆధారపడటం తగ్గించుకోవాలని ఆపిల్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అందుకోసం ఆపిల్ ఐ-ఫోన్ 14 సిరీస్‌లో ఐ-ఫోన్14, ఐఫోన్ మ్యాక్స్, ఐఫోన్-14 ప్రో మ్యాక్స్ ఫోన్లను భారత్‌లోనూ ఉత్పత్తి చేయనున్నది.
చైనాతోపాటు భారత్‌లో ఐ-ఫోన్ ఉత్పత్తిదారు ఫాక్స్‌కాన్ ఐఫోన్-14 సిరీస్ ఫోన్ల ఉత్పత్తి ప్రారంభించనున్నదని సమాచారం. కొన్నేండ్లుగా భారత్‌లోనూ ఐ-పోన్ల ఉత్పత్తిని చేపట్టినా.. చైనాతో పోలిస్తే నాలుగోవంతు, అంత కంటే తక్కువేనని వార్తలొచ్చాయి. ఇక ఐ-ఫోన్ 14 సిరీస్ ఫోన్లు 6.1 అంగుళాల డిస్‌ప్లేతో ఫాక్స్‌కాన్ ఉత్పత్తి చేయనున్నది. ఈ జాబితాలో వనీలా ఐఫోన్-14, ఐఫోన్-14 ప్రో ఉన్నాయి. ఇక ఐఫోన్-14 మ్యాక్స్, ఐ-ఫోన్-14 ప్రో మ్యాక్స్ ఫోన్లను 6.7 అంగుళాల డిస్‌ప్ల్లేతో ఉత్పత్తి చేయనున్నది. చైనాతోపాటు భారత్లో ఫోన్లను తయారు చేయాలని ఆపిల్ నిర్ణయం తీసుకోవడం ముఖ్యమైన మైలురాయి అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.ఆపిల్ వృద్ధిలో భారత్ మార్కెట్ కీలక ప్రాంతం కానున్నదని అంటున్నారు. ఆపిల్.. ఐ-ఫోన్ 13 మాదిరిగానే ఐఫోన్-14ను కూడా 799 డాలర్ల (సుమారు రూ.64 వేలు)కు మార్కెట్లోకి తేనున్నదని వార్తలొస్తున్నాయి.