Saturday, November 23, 2024

వెంకయ్యనాయుడు ఆదర్శనీయుడు: మోడీ

- Advertisement -
- Advertisement -

Venkaiah Naidu are wit liners

ఢిల్లీ: భారతదేశం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న సమయంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి స్వాతంత్ర్య భారతంలో పుట్టినవారు కావడం, వారంతా సామాన్య కుటుంబాల నుంచి రావడం మనందరికీ గర్వకారణమని ప్రధాని మోడీ తెలిపారు. భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ముప్పవరకు వెంకయ్యనాయుడు వీడ్కోలు సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు చేసిన ప్రసంగాలు, మాట్లాడిన ప్రతి మాట యువతను, మహిళలను, సమాజంలోని పీడిత, తాడిత వర్గాలకు ఎంతగానో ప్రేరణనిచ్చాయని ప్రశంసించారు. ఈ ఐదేళ్లలో ఉపరాష్ట్రపతిగా చేసిన ప్రసంగాల్లో సింహభాగం యువతను, యువ శక్తిని ఉద్దేశించి చేయడం ప్రేరణాత్మకమన్నారు.  మాటల మాంత్రికుడిగా  ప్రయోగించే పదజాలం, ఏక వాక్య ప్రయోగాలు, ప్రేరణాత్మక వాక్య ప్రయోగాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమేనని మెచ్చుకున్నారు.

వెంకయ్యనాయుడు మార్గదర్శనంలో పనిచేసే అవకాశం తనకు దక్కిందని, దీంతోపాటు సన్నిహితంగా  కలిసి పనిచేసే అవకాశం కూడా తనకు దక్కిందన్నారు. అందుకు గర్వపడుతున్నానని, దేశం పట్ల మీకున్న ప్రేమ, గౌరవాభిమానాలకు కృతజ్ఞుడిగా ఉంటానన్నారు. భారతీయ జనతా పార్టీ, ప్రభుత్వం మీకు ఏయే బాధ్యతలను అప్పగించినా వాటిని ఎంతో చిత్తశుద్ధి, అంకితభావంతో నిర్వహించడంతో పాటు తన లాంటి కార్యకర్తలందరికీ వెంకయ్యనాయుడు మార్గదర్శకంగా నిలిచారని ప్రశంసించారు. మాతృభాష పట్ల అభిరుచి అభినందనీయమని, ఆదర్శనీయమని, దాదాపుగా మీరు మాట్లాడిన ప్రతి సందర్భంలో మాతృభాషను కాపాడుకోవడం, ప్రోత్సహించడంపై వెంకయ్యనాయుడు అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టేవారని గుర్తు చేశారు. విద్యార్థి నాయకుడిగా  ప్రారంభించిన ప్రస్థానం, మీ జీవితంలో సాధించిన మైలురాళ్లు చాలా ప్రత్యేకమైనవని, రాజకీయంగా కూడా మీ జీవనం పారదర్శకంగా సాగిందని, ఎన్నో విలువలను నిజ జీవితంలో అమలుచేసి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు.

వెంకయ్యనాయుడు హయాంలో రాజ్యసభ పనితీరు ఎంతగానో మెరుగుపడిందని, సభ్యుల హాజరు గణనీయంగా పెరిగిందని, తమరి మార్గదర్శనంలో ఎన్నో బిల్లులు విజయవంతంగా ఆమోదించాబడ్డాయని మోడీ ప్రశంసించారు. అంతేకాదు. రాజ్యసభ సచివాలయాన్ని, కాగిత రహిత వ్యవస్థను ప్రోత్సహించడం వంటి ఎన్నో కార్యక్రమాలకు తమరు బీజం వేశారని, ధర్మం, కర్తవ్యంతో మార్గదర్శనం చేశారని, సభాకార్యక్రమాల విషయంలో, సభలో సభ్యుల ప్రవర్తన, బాధ్యత తదితర విషయాల్లో అనుభవాలను చెబుతూ ప్రేమగా హెచ్చరించేవారని గుర్తు చేశారు.  మొట్టికాయలు వేసినా.. మార్గదర్శనం చేసినా అది వెంకయ్యనాయుడికే చెల్లిందన్నారు.

చర్చల ద్వారానే ఏ సమస్యకైనా పరిష్కారం అనే విషయంలో మీరు చేసిన మార్గదర్శనం మా అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉందని, అన్ని పార్టీల ఎంపిలకు సరైన అవకాశాలివ్వడంతో పాటు వారి అనుభవం సభకు ఎలా అవసరమో నిరంతరం చెబుతూ వచ్చారని, ఇవాళ అందరూ వెంకయ్యనాయుడికి వీడ్కోలు చెప్పేందుకు సభకు హాజరవడం తమరిపై ఉన్న గౌరవానికి సంకేతమని కొనియాడారు. మీరు చూపిన బాట.. అనుసరించిన విధానాలు.. ఈ స్థానంలో కూర్చునేవారికి మార్గదర్శకంగా నిలిచాయన్నారు. మీరు దేశం కోసం, పార్లమెంటరీ వ్యవస్థ కోసం చేసిన కృషికి, మార్గదర్శనానికి ప్రధానమంత్రిగా, పార్లమెంటు సభ్యులందరి తరపున మోడీ ధన్యవాదాలు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News