Saturday, December 21, 2024

స్టాండింగ్ కమిటీకి విద్యుత్ బిల్లు

- Advertisement -
- Advertisement -

విపక్షాల నిరసనలు, వాకౌట్ల మధ్య లోక్‌సభకు విద్యుత్ చట్టం సవరణ బిల్లు
విస్తృతస్థాయి చర్చకు స్థాయి సంఘానికి నివేదించాలని స్పీకర్‌కు మంత్రి సూచన

న్యూఢిల్లీ: ప్రతిపక్షాల తీవ్రనిరసన, వాకౌట్ మధ్య కేంద్ర ప్రభుత్వం సోమవారం ఎలక్ట్రిసిటి చట్టానికి పలు సవరణల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. విద్యుత్ సరఫరాదార్ల పంపిణీ వ్యవస్థలకు వివక్షలేని బహిరంగ అనుసంధానం చేసే దిశలో ఈ బిల్లు తీసుకువచ్చామని ప్రభుత్వం తెలిపింది. అయితే బిల్లు రాష్ట్ర ప్రభుత్వాల విద్యుత్ హక్కుల హరణకు ఉద్ధేశించిందని పేర్కొంటూ విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ఎలక్ట్రిసిటీ సవరణ బిల్లు 2022 ను ఆదినుంచి ఎదురవుతున్న వ్యతిరేకతల బేఖాతరుతోనే కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్‌కె సింగ్ సభలో ప్రవేశపెట్టారు. విపక్షాలు లేవనెత్తుతున్న ఆందోళనలను తాము అర్థం చేసుకుంటున్నట్లు, అయితే దీనిపై మరింత విస్తృతస్థాయి సంప్రదింపులకు పార్లమెంటరీ స్థాయీ సంఘానికి నివేదించాలని స్పీకర్ ఓంబిర్లాకు విజ్ఞప్తి చేశారు.

బిల్లు ముసాయిదాలోని అంశాలు షాకింగ్‌గా ఉన్నాయని విపక్షాలు నిరసనకు దిగాయి. దీనిని ప్రవేశపెట్టరాదని కోరారు. రాష్ట్రాల విద్యుత్ పంపిణీ అధికారాలకు కోతలు పెట్టే విధంగా ఉన్న బిల్లు అనుచితం అవుతుందని కాంగ్రెస్ సభ్యులు అధీర్ రంజన్ చౌదరి, మనీష్ తివారి, ఆర్‌ఎస్‌పి నుంచి ఎన్‌కె ప్రేమాచంద్రన్, సిపిఎం సభ్యులు ఎంఎ అరిఫ్, టిఎంసి నుంచి సౌగథా రాయ్, డిఎంకె సభ్యులు టిఆర్ బాలు ఇతరులు తెలిపారు. ఈ బిల్లు రాజ్యాంగంలోని సమాఖ్య వ్యవస్థకు భిన్నంగా ఉందన్నారు. ఎలక్ట్రిసిటి దేశంలో ఉమ్మడి జాబితా అంశంగా ఉంది. మరి సంబంధిత పరిధిలోకి వచ్చే బిల్లుకు ముందు కేంద్రం విధిగా పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించాల్సి ఉంటుందని సభ్యులు స్పష్టం చేశారు.

విద్యుత్ ప్రైవేటీకరణ దిశకే : తివారీ

బిల్లులో చాలా వివాదాస్పద అంశాలు ఉన్నాయి. బిల్లు సమగ్రమైన రీతిలో విద్యుత్ పంపిణీకి ఉపయోగపడుతుందని ప్రభుత్వం అధికారికంగా తేనెమాటలు చెప్పడం తప్ప వాస్తవికంగా ఇందులో చేటుతనం ఉందని కాంగ్రెస్ సభ్యులు మనిష్ తివారి తెలిపారు. ఒకే ప్రాంతంలో ప్రైవేటు కంపెనీలు విస్తరించుకుని పోతాయి. అవే విద్యుత్ పంపిణీకి దిగుతాయి. ఇది లాభాల ప్రైవెటీకరణ, నష్టాల జాతీయకరణ బాపతు వ్యవహారంగా ఉందన్నారు. విద్యుత్‌ను ప్రైవేటు చేసే తంతుగా సాగుతోందన్నారు. విద్యుత్ చట్టానికి సవరణలు తీసుకువచ్చేది లేదని సంయుక్త కిసాన్ మోర్చా నేతలకు మోడీ ఇచ్చిన హామీ గాలికి వదిలిపెట్టారని , బిల్లు తీసుకువచ్చారని టిఎంసి ఎంపి సౌగథా రాయ్ విమర్శించారు. విద్యుత్ పంపిణీకి సంబంధించి ఇప్పటికే రాష్ట్రాలు ఓ నిర్థిష్ట పంథాలో వెళ్లుతున్నప్పుడు రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడకుండా ఈ మార్పుల బిల్లు తీసుకువస్తే పరిస్థితి ఏమిటని డిఎంకె సభ్యులు బాలు ప్రశ్నించారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తోంది. అయితే ప్రతిపాదిత బిల్లుతో ఉచిత విద్యుత్ కోటా దెబ్బతింటుంది. పేద రైతు చిక్కుల్లో పడుతారని తెలిపారు. దీర్ఘకాలిక విద్యుత్ పథకాల పరిస్థితి ఏమిటని సభ్యులు నిలదీశారు.

రైతుల ఉచిత విద్యుత్ ఉంటుంది…దుష్ప్రచారాలు వద్దు

బిల్లును పనిగట్టుకుని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తూ, దుష్ప్రచారానికి దిగుతున్నాయని విద్యుత్ మంత్రి సింగ్ తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగుతుంది.సబ్సిడీల ఉపసంహరణ ఉండదని తెలిపారు. రాష్ట్రాలు , సంబంధిత భాగస్వామ్యపక్షాలతో తగు సంప్రదింపుల తరువాతనే బిల్లు తీసుకువచ్చామని, కావాలంటే సంబంధిత రికార్డులు చూడవచ్చునని మంత్రి సవాలు విసిరారు. అయితే విపక్ష సభ్యులు బిల్లు జనం వ్యతిరేకమని పేర్కొంటూ బిల్లు ప్రవేశపెట్టవచ్చా లేదా అనే అంశంపై ఓటింగ్ జరగాలని డిమాండ్ చేశారు. దీనిని స్పీకర్ తోసిపుచ్చారు. సభ్యులు ముందు వారి స్థానాలకు వెళ్లి డిమాండ్ తెలియచేయాలి తప్ప, వెల్‌లోకి దూసుకుపోవడం అనుచితం అని మంత్రి తెలిపారు. సభ్యులు కొద్ది సేపు నినాదాలకు దిగిన తరువాత బిల్లుకు వ్యతిరేకంగా వాకౌట్ జరిపారు.

కమ్యూనికేషన్ మాదిరిగానే ఎలక్ట్రిసిటి ప్రైవేటీకరణ

బిల్లులోని అంశాలు ఎక్కువగా విద్యుత్ పంపిణీ వ్యవస్థ ప్రైవేటీకరణ దిశలోనే ఉన్నాయి. ఇప్పటివరకూ కమ్యూనికేషన్ రంగం ఫోన్లు, ఐటి వ్యవస్థల్లో నెలకొన్నట్లే ప్రైవేటకీరణకు రంగం సిద్ధం అయింది. ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే ఇకపై విద్యుత్ వినియోగదారులు మొబైల్ లేదా ఇంటర్నెట్ వాడకపు దార్ల మాదిరిగా తాము కోరుకునే ప్రైవేటు విద్యుత్ పంపిణీ వ్యవస్థ కంపెనీలను ఎంచుకోవచ్చు. వాటి నుంచి విద్యుత్‌ను పొందవచ్చు. అయితే పంపిణీని మరింత సక్రమం చేసేందుకు బిల్లు తీసుకువచ్చామని కేంద్రం తెలిపింది. డిమాండ్‌కు తగ్గ సరఫరా అవసరం ,ఈ దిశలో చర్యలకు ఈ చట్టసవరణల బిల్లు పనికివస్తుందని వాదించింది.

షాక్ కొట్టించే సవరణలు …జనానికి ముప్పే ః కేజ్రీవాల్

కేంద్రం తీసుకువచ్చిన ఎలక్ట్రిసిటీ బిల్లు చాలా ప్రమాదకరం, దీనితో ప్రజలు మరింత కష్టాల్లో పడుతారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత కేజ్రీవాల్ విమర్శించారు. ప్రమాదకరమైన ఈ విషయంలో తొందరెందుకు? కేంద్రం నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. హడావిడి నిర్ణయాలు అమలు చివరికి కొన్ని విద్యుత్ కంపెనీలకు లాభాలుతోడిపెట్టినట్లు అవుతుందని అన్నారు. జనం కోసం చూస్తారా? ఈ కంపెనీల బాగుకు ఆలోచిస్తారా? అని ప్రశ్నించారు. ఈ బిల్లు రాష్ట్రాల రాజ్యాంగ సవరణకు హానీకరం అని పంజాబ్ సిఎం భగవంత్ మాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సహకార సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారని కేంద్రంపై మండిపడ్డారు. రాష్ట్రాల అధికారాలకు కత్తెర దిశలో ఇది ఇప్పుడు కరెంట్ షాక్ పరిస్థితి అయిందన్నారు. రాష్ట్రాలు తమ హక్కుల కోసం రహదారుల నుంచి పార్లమెంట్ వరకూ పోరాడుతాయని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియను మోడీ విచ్ఛిన్నం చేస్తే రాష్ట్రాలు చూస్తూ ఊరుకుంటాయా? అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News