హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మీడియా మిత్రులతో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించారు. చిట్ చాట్ కార్యక్రమంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ… కుటుంబ పాలన గురించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజగోపాల్ రెడ్డికి ఆయన సోదరులు, భార్య కనిపించలేదా? వారిది కుటుంబ పాలనే అన్నారు. స్వార్ధ ప్రయోజనాల కోసం రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. కాంట్రాక్టుల కోసం రాజగోపాల్ రెడ్డి బిజెపి వైపు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా బిజెపికి అవసరం. బిజేపి పార్టీ ఒత్తిడి వలనే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని చెప్పారు. తెలంగాణలో రాజకీయంగా విస్తరణ కోసమే బిజెపి రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించిందని ఆరోపించారు. మునుగోడు ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి మునగడం ఖాయమన్నారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లతో తెలంగాణ రాష్ట్రానికి నష్టమే అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు రాష్ట్రం సుభీక్షంగా ఉంటుందన్నారు. రేవంత్ రెడ్డిపై పై దాసోజ్ శ్రావణ్ వ్యాఖ్యలు వాస్తవికంగా ఉన్నాయన్న ఆయన చాలా రాష్ట్రాలలో తినడానికి సరైన తిండి లేదు. అది వదిలి ఇతర అంశాల మీద ప్రధాని మోడీ దృష్టి పెడుతున్నారని మండిపడ్డారు.
నిత్యవసర ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటి నుండి దృష్టి మళ్లించేందుకే వివిధ రాష్ట్రాలలో రాజకీయ అనైతిక వాతావరణం సృష్టిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీనే ఘనవిజయం సాధిస్తుందని ఆయన వెల్లడించారు. మునుగోడులో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలి అనే విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు. అసలు రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చిందో రాజగోపాల్ రెడ్డి క్లారిటిగా చెప్పలేకపోతున్నారు. తిండి ఎక్కువై రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని విమర్శించారు. ఉన్నదాని కంటే ఎక్కువ ఊహించుకోవడం కోమటిరెడ్డి బ్రదర్స్ కు మొదటి నుండి అలవాటేనని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. గతంలో రాజగోపాల్ రెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీనియర్ నేతలు ఎవరూ మద్దతివ్వలేదు. నేను జానారెడ్డి నిలబడి అందర్నీ కన్విన్స్ చేసి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాము. రాజగోపాల్ రెడ్డి బిజెపిలో ఉండడు… భవిష్యత్తులో మునిగిపోతాడని గుత్తా స్పష్టం చేశారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవనని రాజగోపాల్ రెడ్డికి కూడా తెలుసు. మునుగోడులో కాంగ్రెస్ బిజెపి పార్టీలు రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయి. మునుగొడులో పోటీ చేయాలని ఎవరు నన్ను అడగలేదు. అడిగితే అప్పుడు ఆలోచిస్తా.. ప్రస్తుతం నేను శాసన మండలి ఛైర్మన్ హోదాలో సంతృప్తిగా ఉన్నాను. మునుగోడు ప్రజలు చాలా చైతన్యం కలిగిన ప్రజలు. అధికారంలో ఉన్న పార్టీతోనే సంపూర్ణ అభివృద్ధి జరుగుతుందని వాళ్లకు తెలుసన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీగా,ఎమ్మెల్సీగా,ఎమ్మెల్యే గా ఎంత అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. మునుగోడు నియోజకవర్గంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని గుత్తా పేర్కొన్నారు.