మన తెలంగాణ / హైదరాబాద్ : జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవి ఛార్జింగ్, బయో డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్‌లు ప్రారంభమయ్యాయి. పర్యావరణ పరిరక్షణ కార్యకలాపాల దిశగా తన కృషిని బలోపేతం చేస్తూ జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్(జిహెచ్‌ఐఎఎల్) ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ స్టేషన్, బయో డీజిల్ ఫిల్గింగ్ స్టేషన్లను ప్రారంభించింది. ఎలక్ట్రిక్ వెహికిల్ ఛార్జింగ్ స్టేషన్ మెయిన్ కార్ పార్క్‌లో ఉండగా బయో డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రజా రవాణా కేంద్రం (పిటిసి) వద్ద ఉంది. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సేవలను పొందాలనుకునే ఇవి వినియోగదారులకు ఈ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులో ఉంటుంది. 30 రెడబ్లుతో ఇది ఒక ఫోర్ వీలర్ వాహనాన్ని గంటలో 0 నుండి ఫుల్ చార్జ్ చేస్తుంది. ఈ ఛార్జింగ్ స్టేషన్ యాప్ ద్వారా పనిచేస్తుంది. అండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ మొబైల్ పరికరాల ద్వారా ఉపయోగించడానికి అనుకూలం. దీని వల్ల ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రొత్సాహం లభిస్తుంది.
ఎలక్ట్రిక్ వాహనాలు కాలుష్యం నిలువరిస్తాయి. విమానాశ్రయ ప్రాంగణం చుట్టూ శబ్దాలను నియంత్రణలో ఉంచుతాయి. విమానాశ్రయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని మరింత మెరుగు పరుస్తుంది. భారతీయ విమానాశ్రయాలలో మొట్టమొదటి సారిగా జిహెచ్‌ఐఎఎల్ విమానాశ్రయంలో బయో డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్‌ను ప్రారంభించింది. బయోడీజి వాడకం డీజిల్ ఇంజన్‌ల జీవితాన్ని పొడిగిస్తుంది. ఈ సందర్భంగా జిహెచ్‌ఐఎఎల్ సిఇఓ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సుస్థిర, పర్యావరణ అనుకూల విధానంలో నిర్వహించడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. జీరో కార్బన్ ఎమిషన్ ఎయిర్‌పోర్ట్‌గా ఉండాలని లక్షంగా పెట్టుకుని పర్యావరణ అనుకూల చర్యలను చేపట్టినట్లు తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నామన్నారు. జిహెచ్‌ఐఎఎల్ మొత్తం సోలార్ పవర్ సామర్థం ఇప్పుడు 10 మెగావాట్లకు పెరిగిందన్నారు. ఈ సోలార్ పవర్ ఉత్పాదనతో జిహెచ్‌ఐఎఎల్ 50 శాతం శక్తి అవసరాలు తీరుతాయన్నారు.