మనతెలంగాణ/హైదరాబాద్: అదనపు ఆర్థిక వనరులు సహా ఇతర అంశాలపై చర్చించేందుకు తెలంగాణ మంత్రివర్గం గురువారం సమావేశం కానుంది. సిఎం కెసిఆర్ అధ్యక్షతన 11వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు ప్రగతి భవన్‌లో కేబినెట్ భేటీ జరగనుంది. నిరుపయోగంగా ఉన్న భూములు, రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల విక్రయం, పన్నేతర ఆదాయం పెంచుకోవడం తదితర వాటితో పాటు పలు అంశాల గురించి మంత్రివర్గంలో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కొత్త పింఛన్లు, డయాలసిస్ రోగులకు ఆసరా పింఛన్లు, అనాథపిల్లల సంక్షేమం కోసం చర్యలు, స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదల సహా ఇతర అంశాలపై కేబినెట్ చర్చించనుంది. దీంతోపాటు ఈనెలలో శాసనసభ ప్రత్యేక సమావేశం, స్థానిక సంస్థల సమావేశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఈ సమావేశంలో పాలనాపరమైన అంశాలతో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం పొందిన నేపథ్యంలో మునుగోడు ఉపఎన్నిక, పార్టీ వ్యూహం, సంబంధిత అంశాలపై కూడా చర్చించనున్నట్టుగా సమాచారం.
Telangana Cabinet Meeting on Aug 11