Sunday, November 24, 2024

ఈ నెల 21న బిజెపిలో చేరడం లేదు

- Advertisement -
- Advertisement -

Jayasudha clarified that she will not join BJP on 21st Aug

తేల్చి చెప్పిన సినీ నటి, మాజీ ఎంఎల్‌ఎ జయసుధ

మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 21న తాను బిజెపిలో చేరడం లేదని సినీ నటి, మాజీ ఎంఎల్‌ఎ జయసుధ స్పష్టం చేశారు. పార్టీలో చేరాలని జయసుధతో బిజెపి నేతలు సంప్రదింపులు జరిపారని సమాచారం. అయితే పార్టీలో చేరిక విషయమై జయసుధ బిజెపి నాయకుల వద్ద కొన్ని డిమాండ్లు పెట్టినట్టుగా ప్రచారం సాగుతుంది.ఈ డిమాండ్లను అంగీకరిస్తే బిజెపిలో చేరేందుకు సానుకూలంగా ఉన్నట్టుగా జయసుధ సంకేతాలు పంపారని ఓ న్యూస్ ఛానల్ కథనం ప్రసారం చేసింది. తన డిమాండ్ల విషయమై బిజెపి కేంద్ర నాయకత్వం నుండి హామీ లభిస్తే తాను ఆ పార్టీలో చేరేందుకు సిద్దమేనని జయసుధ సంకేతాలు ఇచ్చారని సదరు కథనం తెలిపింది. ఈ నెల 21న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో పాటు తాను బిజెపిలో చేరుతాననే ప్రచారాన్ని జయసుధ తోసిపుచ్చారు. ఉమ్మడి ఎపి రాష్ట్రంలో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఆమె విజయం సాధించారు. సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి జయసుధ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

2014 ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి జయసుధ మరోసారి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. 2016 జనవరి 17న ఆమె కాంగ్రెస్ ను వీడి టిడిపిలో చేరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో టిడిపి బలోపేతం కోసం తాను ప్రయత్నిస్తానని ఆమె ప్రకటించారు. 2019లో జయసుధ టిడిపిని వీడి వైసీపీలో చేరారు. వైసీపీలో చేరినప్పటికీ జయసుధ ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గోనడం లేదు. రాజకీయ కార్యక్రమాలకు ఆమె దూరంగానే ఉంటున్నారు.ఈ తరుణంలోనే బిజెపి నేతలు జయసుధతో చర్చలు జరిపారు. బిజెపిలో చేరాలని కోరారు. అయితే పార్టీలో చేరేందుకు జయసుధ కొన్ని డిమాండ్లు పెట్టినట్టుగా సమాచారం.

తెలంగాణ రాష్ట్రంలో కీలక నేతలను తమ వైపునకు తిప్పుకోవాలని బిజెపి ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని కమల దళం నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు దీంతో రాష్ట్రంలో కీలక నేతలతో బిజెపి నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు.కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలతో పాటు 12 మంది టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీతో టచ్ లో ఉన్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మరిన్ని ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని బండి సంజయ్ చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News