హైదరాబాద్: సిఎం కెసిఆర్ ఇచ్చిన మాట నిలుపుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి అన్నిజిల్లాల కలెక్టర్లు, డిఆర్డిఓలకు మౌఖిక ఆదేశాలిచ్చారు. ఇందుకు సిఎం కెసిఆర్‌కి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ, అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉద్యోగాలు చేసుకోవాలని ఆదేశించారు. ఇదిలావుంటే, ఫీల్డ్ అసిస్టెంట్లలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అనేక చోట్ల ఫీల్డ్ అసిస్టెంట్లు సిఎం కెసిఆర్, మంత్రి ఎర్రబెల్లిల చిత్ర పటాలకు పాలాభిషేకాలు చేశారు. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్ల 28నెలల సుదీర్ఘ ఎదరుచూపులు, అనేక పోరాటాలు, ఆరాటాల తర్వాత మంత్రి ఎర్రబెల్లి సిఎం కెసిఆర్ చేసిన విజ్ఞప్తులు ఫలించినట్లయింది.
రాష్ట్ర వ్యాప్తంగా 2007 ఫిబ్రవరిలో 7,561 మంది ఫీల్డ్ అసిస్టెంట్లని ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంది. అప్పట్లో 1200 జీతంతో విధుల్లోకి వచ్చిన వారికి కొద్ది నెలల్లోనే 10వేల జీతాలు ఇచ్చింది. ఉపాధి హామీ కూలీల మస్టర్ రోల్స్ రాయడం, వారిపనులను పర్యవేక్షించడం వంటి పనులు చేశారు. తర్వాత జాబ్ కార్డులు ఉన్నవాళ్ళల్లో సాధ్యమైనంత ఎక్కువమందిని ఉపాధికి వచ్చేవిధంగా చూడాలని, విధుల్లో తప్పనిసరిగా ఉండాలని అధికారులు ఆదేశించారు. ఇదే సమయంలో తమకు జీతాలు ఎస్టీఓల నుంచి ఇవ్వాలని, తమను పర్మినెంట్ చేయాలని ఇంకొన్ని డిమాండ్లతో ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళనలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం తేదీ 18-03-2021న ఫీల్డ్ అసిస్టెంట్లను తాత్కాలికంగా పక్కన పెట్టింది. కాగా, అప్పటి నుండి 28 నెలలుగా ఫీల్డ్ అసిస్టెంట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ని కలిసి తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వచ్చారు.
ఇదే విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి సిఎం దృష్టికి తీసుకెళ్ళారు. అయితే, ఫీల్డ్ అసిస్టెంట్లు తమ ప్రభుత్వ నిబంధనల మేరకే పని చేస్తామని, అనవసర అందోళనలు చేయమని చెబుతూ లిఖిత పూర్వకంగా కూడా మంత్రికి విన్నవించారు. ఇదే విషయాన్ని మంత్రి పదే పదే సీఎం దృష్టికి తీసుకెళ్ళి సిఎం గారిని ఒప్పించారు. మరోవైపు మానవీయ విలువలతో పరిపాలన చేస్తున్న సీఎం కెసిఆర్, పీల్డ్ అసిస్టెంట్లను తీసుకోవాడానికి నిర్ణయించారు. సిఎం నిర్ణయం మేరకు ఈ నిర్ణయం వెలువడటం, ఆదేశాలివ్వడం, వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించడం వెంట వెంట జరిగాపోయాయి. దీంతో మంత్రి ఎర్రబెల్లి సిఎం గారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ, వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా తాము వెంటనే విధుల్లో చేరుతామని ప్రటకిస్తూ, సిఎం కెసిఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి చిత్ర పటాలకు పలాభిషేకాలు చేశారు. దీంతో 28 నెలల ఫీల్డ్ అసిస్టెంట్ల ఎదురు చూపులు ఫలించి, ఈ సమస్య సిఎం గారి నిర్ణయంతో సుఖాంతమైంది.