అర్ధసత్యాలంటూ బెంగాల్ మంత్రుల ఖండన
కోల్‌కత: తృణమూల్ కాంగ్రెస్ నాయకులు కొందరి ఆస్తులు క్రమంగా పెరుగుతున్నాయంటూ వచ్చిన ఆరోపణలను పశ్చిమ బెంగాల్ మంత్రులు ఫర్హద్ హకీమ్, మలోయ్ ఘటక్ ఖండించారు. ఇవి అర్ధసత్యాలు, తప్పుదారి పట్టించే ఆరోపణలంటూ వారు అభివర్ణించారు. కొందరు బెంగాల్ మంత్రులు, టిఎంసి నాయకుల ఆస్తులలో గణనీయమైన వృద్ధి కనిపిస్తోందని ఆరోపిస్తూ దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కలకత్తా హైకోర్టు ఈ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను కూడా ప్రతివాదిగా చేరుస్తూ ఈనెల 8న ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేసులో పేర్కొన్న టిఎంసి నాయకులు అందరూ తమ ఆదాయ వివరాలను ప్రకటించారని మంత్రి హకీమ్ బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. తమను అప్రతిష్ట పాల్జేసేందుకు ఉద్దేశపూర్వకంగానే ఒక తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన చెప్పారు. ఐటి రిటర్న్‌లు దాఖలు చేసే సమయంలో తమ ఆదాయ వివరాలను ప్రకటించామని, ఆదాయం పెరిగినంత మాత్రాన అందులో తప్పేం ఉందని ఆయన ప్రశ్నించారు. తనకు సొంత వ్యాపారం ఉందని, అంతేగాక మంత్రిగా జీత భత్యాలు లభిస్తాయని ఆయన తెలిపారు. 2011 నుంచి 2016 మధ్య మంత్రులు, నాయకుల ఆస్తుల పెరుగుదలపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ 2017 ఫిబ్రవరిలో కలకత్తా హైకోర్టు ఒక పిల్ దాఖలైంది.