ఈ నెల 31 నుంచి అమలవుతాయి: కేంద్రం
న్యూఢిల్లీ : కరోనావైరస్ మహమ్మారి సమయంలో 2020 సంవత్సరంలో దేశీయ విమానయాన సంస్థలపై విధించిన విమాన చార్జీల ఆంక్షలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్ట్ 31 నుంచి విమాన చార్జీల పరిమితిని తొలగిస్తామని బుధవారం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంటే వచ్చే నెల నుంచి విమాన టిక్కెట్ ధరలపై కనిష్ట, గరిష్ఠ ఆంక్షలు ఉండవు. దీంతో విమాన సంస్థలు ఇకపై స్వేచ్ఛగా మార్కెట్లో డిమాండ్, సప్లై ఆధారంగా చార్జీలపై నిర్ణయం తీసుకోవచ్చు. రోజువారీ డిమాండ్, ఎటిఎఫ్ ధరలను పరిశీలించిన తర్వాత విమాన చార్జీల ఆంక్షలను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీంతో విమానయాన సంస్థలకు భారీ ఊరట లభించనుంది. కొత్త విమానయాన సంస్థ ఆకాశా ఎయిర్‌లైన్ టిక్కెట్లను చౌకగా అమ్మడం ద్వారా ఇండిగో, గోఫస్ట్ సహా విమానయాన సంస్థల మధ్య పోటీని పెంచింది. కరోనా మహమ్మారి సమయంలో ప్రభుత్వం విమానయాన సంస్థల కోసం ఈ ఆంక్షలను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, ప్రభుత్వం ప్రతి 15 రోజులకు విమానయాన సంస్థల కనీస, గరిష్ట చార్జీల రేట్ల శ్రేణిని నిర్ణయించింది. విమానయాన సంస్థలు తమ చార్జీలను ఈ బ్యాండ్ కంటే పైన లేదా దిగువన చార్జీ చేయలేవు. వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగాన్ని కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతీసింది. అయితే ఇప్పుడు ఈ రంగం కోలుకుంటోంది. ముఖ్యంగా విమాన ప్రయాణీకుల విషయంలో పురోగతి కనిపిస్తోంది.