Monday, December 23, 2024

ప్రతిపక్షానికి అదనపు బలం

- Advertisement -
- Advertisement -

Succession fight in Shiv Sena..!

బీహార్ పరిణామాలు దేశ రాజకీయాలకు మరో విద్యుచ్చికిత్స (షాక్ ట్రీట్‌మెంట్) వంటివి. కేంద్రంలో తనకున్న విశేషాధికారాలతో ప్రజాస్వామ్య, ఫెడరల్ విధి విధానాలను, విలువలను హరిస్తున్న బిజెపిని మట్టిగరిపించడానికి సిద్ధమవుతున్న ప్రతిపక్ష శక్తులకు టానిక్ మాదిరివి అనవచ్చు. బిజెపి పాలకుల నియంతృత్వ పోకడలను తీవ్ర స్వరంతో విమర్శించి పోరు జెండా ఎగురవేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అడుగుజాడల్లోనే నితీశ్ కుమార్ దాని కుత్సిత కౌగిలి నుంచి బయటపడి నిరసన శంఖాన్ని పూరించారు. నితీశ్ బిజెపితో తెగతెంపులు చేసుకొని ఆర్‌జెడితో మహాకూటమి కట్టడాన్ని ఆయన మరో అవకాశవాద అవతారంగా భావించే వారికి కొదువ వుండదు. ఆయన గత చరిత్ర అటువంటి అభిప్రాయానికి అవకాశం కలిగిస్తుంది. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్‌తో కలిసి మహాఘట్ బంధన్‌ను నిర్మించి 2015 ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన నితీశ్ నడిమధ్యలో ఆ నావను ముంచేసి బిజెపి పడవలోకి దూకి దాని మద్దతుతో సిఎంగా కొనసాగారు.

ఇప్పుడు కూడా తన గద్దె కాపాడుకోడానికే ఆయన ఈ అంకానికి తెర లేపారనే విమర్శను ఆయన వ్యతిరేకులు, ముఖ్యంగా బిజెపి పక్షపాతులు నిశితంగా సంధించారు. పాము మీ దుప్పట్లోనే దూరిందంటూ లాలూ వ్యాఖ్యను ఆయన మీదకే బిజెపి తిప్పికొట్టింది. ఉపరాష్ట్రపతి పదవిని ఆశించి భంగపడిన నితీశ్ ఆ అసంతృప్తితోనే తిరుగుబాటుకు పాల్పడ్డారని కూడా కత్తులు దూశారు. కాని ఇప్పటి పరిస్థితుల్లో నితీశ్ చర్య ప్రతిపక్ష రాజకీయాలను ప్రయోజనకరమైన మలుపు తిప్పింది. ఇది నిస్సందేహంగా విశేషమైన సానుకూల పరిణామం. ఇందుకు ఆయనను అభినందించాలి. దేశ చరిత్రలో ఇదొక కీలక ఘట్టం. కొంచెమైనా బెదురు, భయం లేకుండా, విచక్షణా రహితంగా రాజ్యాంగ విలువల తల మీదినుంచి సాగిపోతున్న బిజెపి బుల్డోజర్‌ను ఆపి వెనుకకు తిప్పి కొట్టవలసిన అవసరం జాతి జనుల ముందు నిలువెత్తున నిలబడి వుంది. ఇందుకు దన్ను నిలవాల్సిన బాధ్యతను నెరవేర్చడానికే నితీశ్ ఈ అడుగు వేశారు.

దాని కోసమే బీహార్ శాసనసభలో అతి పెద్ద పార్టీ ఆర్‌జెడి, దాని మిత్ర కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు తదితర శక్తులు ఆయన వెంట నిలబడ్డాయి. బీహార్ శాసన సభలో ఆర్‌జెడికి సొంతంగా కాని, ఉమ్మడిగా ఆ కూటమికిగాని జెడి(యు) కంటే అధికంగా విశేషమైన బలమున్నప్పటికీ నితీశ్ సారథ్యంలో పని చేయడానికే అవి నిర్ణయించుకున్నాయి. ఇందులో బిజెపి వ్యతిరేక శక్తులను సంఘటితం చేయాలనే సదాశయమే ఇమిడివుంది. తనతో జట్టు కట్టిన పార్టీలనే కబళించే భస్మహస్తం బిజెపి ది. ఇది మహారాష్ట్రలో శివసేన విషయంలో రుజువైంది. ఆ విశ్వాస ఘాతుక గర్వంతో బిజెపి మైమరచిపోతున్న సమయంలో నితీశ్ దాని ఆయుధంతోనే దానికి బుద్ధి చెప్పారు. అందుచేత మహారాష్ట్రలో బిజెపి ది వంచన కాగా, బీహార్‌లో నితీష్ ది నిస్సందేహంగా కమలం పార్టీకి చెప్పిన మరపురాని గుణపాఠం. తాను ఆశ్రయించిన మొక్కను తినేసే చీడకు తగిన చెప్పు దెబ్బ. ప్రధాని పదవి రేసులో తాను లేనని ప్రకటించిన నితీశ్ 2024 ఎన్నికలు మోడీకి నల్లేరు మీద బండి కాబోవని పరోక్షంగా అన్నారు.

ప్రతిపక్ష ఐక్యత కోసం పాటుబడతానని చెప్పారు. ఇందుకు మిగతా ప్రతిపక్షాలు ఒక్క కంఠంతో హర్షం వెలిబుచ్చాయి. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పిలుపు ఇచ్చిన క్విట్ ఇండియా దినోత్సవం నాడే బీహార్ నుంచి బిజెపికి దూరంగా జరగండనే నినాదం వెలువడడం ఒక మంచి ప్రారంభమని, ఇతర రాష్ట్రాలలోని పార్టీలు, దేశ ప్రజలు కూడా బిజెపిని వదిలిపెట్టాలని సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. ప్రధాని పదవిపై దృష్టితో అడుగులు వేసిన మమతా బెనెర్జీ తన సీనియర్ మంత్రి అవినీతిని ఇడి బయటపెట్టడంతో జోరు తగ్గించారనిపించింది. ఈ దశలో నితీశ్ ప్రతిపక్ష నాయక శ్రేణిలో చేరడం బిజెపిపై పోరాటానికి చేవను, చైతన్యాన్ని కలిగించింది. అయితే బిజెపి నితీశ్ మీద కూడా ఇడిని ప్రయోగించే ప్రమాదం లేకపోలేదు. 2019 లోక్ సభ ఎన్నికల్లో నితీశ్‌తో కలిసి పోటీ చేసి ఎన్‌డిఎ బీహార్‌లో గల 40 స్థానాల్లో 39 ని గెలుచుకుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ లబ్ధిని బిజెపి కోల్పోతుంది. బీహార్ బిసిల గడ్డ.

అక్కడ కుర్మీలు, ఎమ్‌బిసిల మద్దతు దండిగా గల నితీశ్ దన్ను లేకపోడం బిజెపికి తీవ్ర నష్టం కలుగ జేస్తుంది. బిసిల జనగణన కోసం నితీశ్ ఇప్పటికే తేజస్వి యాదవ్‌తో కలిసి ఎలుగెత్తారు. ఒక్క బీహార్‌లోనే కాక ఉత్తరాది అంతటా బిసిలను బిజెపికి వ్యతిరేకంగా ఏకం చేయగల శక్తి జెడి(యు), ఆర్‌జెడి, సమాజ్‌వాది, తదితర పార్టీలకు సమకూరుతుంది. జాతీయ ప్రతిపక్షంగా కాంగ్రెస్ గట్టి పాత్రను పోషించలేకపోతున్నది. ఆ ఖాళీని పూరించవలసిన బాధ్యత ప్రాంతీయ పక్షాల మీద పడింది. అవి ఒక్క త్రాటి మీదికి వచ్చి బలవంతమైన సర్పాన్ని సంహరించే చలిచీమల పాత్రను పోషించవలసి ఉంది. ఇందుకు నితీశ్ కలయిక తప్పనిసరిగా తోడ్పడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News