ప్రతిపక్షాల ఐక్యత కోసం కృషి చేస్తా
బీహార్ సిఎం నితీశ్ కుమార్ వెల్లడి
న్యూఢిల్లీ: ప్రధానమంత్రిని కావాలన్న ఆశయం తనకు లేదని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వెల్లడించారు. అయితే కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల మధ్య ఐక్యత కోసం సానుకూల పాత్ర పోషించాలని భావిస్తున్నానని ఆయన చెప్పారు. శుక్రవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ&బిజెపిని అధికారం నుంచి తప్పించి బీహార్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వంపై సిబిఐ, ఇడిలను దుర్వినియోగం చేసే అవకాశం లేకపోలేదని అనుమానం వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగానికి అలవాటుపడిన వారికి ప్రజాగ్రహం తప్పదని ఆయన స్పష్టం చేశారు. మిమల్ని ప్రధాన మంత్రిగా బీహార్ ప్రజలు ఎప్పటికైనా చూస్తారా అన్న విలేకరుల ప్రశ్నకు దయచేసి ఇటువంటి ప్రశ్నలు అడగవద్దని, తన రాష్ట్రానికి సేవ చేయడం తప్ప వేరే ఆశయాలు ఏవీ తనకు లేవని ఆయన చేతులు జోడించి చెప్పారు. ఎన్‌డిఎకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల మధ్య ఐక్యత కోసం కృషి చేస్తారా అన్న ప్రశ్నకు తనకు చాలా మంది నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని, ఎన్‌డిఎకు వ్యతిరేకంగా అందరూ సంఘటితం కావాలన్నదే తన ఆకాంక్షని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో ఈ విషయంలో తన నుంచి కొంత కార్యాచరణను మీరు చూస్తారని ఆయన చెప్పారు.