సంపాదకీయం: రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఓటర్లకు హామీ ఇచ్చే ఉచితాలపై చర్చ మళ్ళీ జోరుగా సాగుతున్నది. ఇందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం నుంచే ప్రేరణ రావడం విశే షం. ఎన్నికల ఉచితాలు పన్ను చెల్లింపుదార్లకు భారంగా మారాయని, దేశ స్వావలంబ నకు అడ్డంకిగా తయారయ్యాయని గతంలో ఒకసారి ప్రధాని మోడీ అన్నారు. ఈ విష యం ఇప్పుడు సుప్రీం కోర్టుకు ఎక్కడంతో దేశవ్యాప్తంగా చర్చ సాగుతున్నది. ఆంగ్లంలో ఫ్రీబీస్‌గా పిలుస్తున్న ఈ ఉచితాలు ప్రధానంగా తమిళనాడులో ఎక్కువగా చోటు చేసుకొ న్నాయి. అధికారంలోకి వస్తే ఇంటింటికీ కలర్ టెలివిజన్ సెట్ ఇస్తామని 2006 అసెంబ్లీ ఎన్నికల్లో కరుణానిధి నాయకత్వంలోని డిఎమ్‌కె వాగ్దానం చేసింది. అప్పటినుంచి ఉన్నత, మధ్యతరగతి వర్గాలనుంచి ఉచితాలు తీవ్రదాడిని ఎదు ర్కొంటున్నాయి. ఇప్పుడు వాటికి చరమ గీతం పాడే ప్రక్రియ మొదలైనట్టు బోధపడుతున్నది. ఈ సందర్బంగా ఈ ఉచితాల కు సంబంధించి వీలైనంత వాస్తవిక దృష్టిని పెంపొందించవలసిన అవసరం ఉంది. టెలి విజన్‌లు, సినిమాలు, చిల్లర కార్యక్రమాలు చూడ్డానికి మాత్రమే ఉపయోగపడే వినోద సాధనాలని, వాటిని ఉచితంగా ఇచ్చి జనాన్ని, ముఖ్యంగా మహిళలను సోమరులను చేస్తున్నారనే విమర్శ వున్నదే.
అయితే అవి మహిళలకు సాధికారతను కలిగించి వారిలో ఆత్మ గౌరవ స్పృహను రగిలించడంలో విశేషంగా తోడ్పడ్డాయని ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయ జర్నల్‌లో ప్రచుతమైన ఒక పరిశోధక వ్యాసం వెల్లడించింది. మహిళలకు టివి అందు బాటులోకి వచ్చినందువల్ల గృహ హింసను ఎదుర్కొనే సామ ర్ధ్యం వారిలో పెరిగిందని, కొడుకునే కనాలనే దృష్టి తగ్గిందని ఈ వ్యాసం తెలియజేసింది. దీనిని తప్పు పట్టే అవకాశం బొత్తిగా లేదు. దేశ జనాభాలో అత్యధికంగా ఉన్న నిరుపేదలు నిరక్షరాస్యులు. తల మీద గట్టి గూడు లేనివారు. సంప్రదాయ పురుషాధిపత్య, అహంకార విలువలే వీరిని నడిపిస్తుంటా యి. అటువంటి చోట ఆధునిక ప్రజాస్వామిక చైతన్యం కలిగించే కేబుల్ టివి అందుబాటు మహిళల్లో చైతన్యాన్ని, పురుషుల్లో అవగానను కలిగిస్తుంది. అలాగే నిత్య జీవనాన్ని పరిమిత శ్రమతో గడపడాని కి, అనేక గృహ సంబంధ పనులను సునాయసంగా చేసుకోడానికి ఉపయోగపడే మిక్సీ, గ్రైండర్ వంటి ఆధునిక ఉపకారణాలను అవి కొనుక్కోలేని పేద ప్రజలకు ఉచితంగా ఇవ్వడాన్ని కూడా తప్పు పట్టలేము. పేదల బతుకులను ఎలాగూ బాగుజేయలేకపోతున్న ప్రభుత్వాలు ఇటువంటి సౌలభ్యాల ను వారికి కలిగించడాన్ని ఎలా ఏహృదయంతో తప్పుపట్టగలం? పన్ను చెల్లింపుడారు సొమ్ము దుర్వ్య యం అవుతున్నదని దేశ స్వావలంబనకు ఆటంకం కలుగుతున్నదని ప్రధాని మోడీ సెలవిచ్చారు.
దీనిపై బహుళ స్థాయిల సమాఖ్య వ్యవస్థ అధ్యయన కేంద్రం చైర్మన్ బల్వీర్ ఆరోరా వెలిబుచ్చిన అభిప్రాయాన్ని గమనించవలసి ఉంది. ఉచితాలని పిలుస్తున్నవి పౌరులకు బకాయిపడిన హక్కులని ఆయన అంటున్నారు. సంక్షేమ చర్యలు, ఉచితాలపై దురవగాహనతో మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. పేదలకు, అవసరంలో ఉన్నవారికి సహాయం అందించేటప్పుడు వాటిని ఉచితాలు అని నిందాస్వరంతో పిలుస్తూ సంప న్నులు బ్యాంకుల నుంచి తీసుకొని తిరిగి చెల్లించని రూ. లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయడాన్ని ఆర్ధిక పునర్నిర్మాణంగా పరిగణించడంలోని ద్వంద్వాన్ని, కపటాన్ని బల్వీర్ సూటిగా ప్రశ్నించారు. ఇదే విషయమై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరింత బల్లగుద్ది వాదించారు.కేంద్ర పాలకులు తమ మిత్రులకు చెందిన రూ.10లక్షల కోట్లు బ్యాంకు రుణాలను రద్దు చేసి ఉండకపోతే పాలు, పెరుగుపై పన్ను విధించవలసి వచ్చేది కాదు అని ఆయన అన్నారు. కార్పొరేట్ కంపెనీలు చెల్లించా ల్సిన రూ. అయిదు లక్షల కోట్ల రూపాయల పన్నులను రద్దు చేయడాన్ని కూడా ఆయన ప్రశ్నించా రు.
ఇదంతా పన్ను చెల్లింపుదార్ల మీద భారం కాదా అని అడిగారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ ఈ అంశంపై వెలిబుచ్చిన అభిప్రాయం వివాదాన్ని గట్టెక్కించేలా లేదు. సంక్షేమానికి, ఉచితాలకు తేడా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇవి సుద్ద, వెన్న మాదిరివని, ఒకేలా ఉండి ఎంతో తేడా కలిగి ఉంటాయని అన్నారు. ప్రజల సంక్షేమ అవసరాలకు, జాతీయ ఆర్ధిక నష్ట నివారణకు మధ్య సంతులనాన్ని సాధించాలని చూస్తున్నామని చెప్పారు. ఆ విధంగా సుప్రీం కోర్టు కూడా ఉచితాలకు వ్యతిరేకతను వ్యక్తం చేసింది. ఉచితాల ద్వారా చట్ట వ్యతిరేక శక్తులు లాభపడుతున్నారని, చట్టబద్ధంగా బతుకుతున్నవారు శిక్షకు గురి అవుతున్నారని సిజెఐ అభిప్రాయ పడినట్టు వార్తలు వచ్చాయి. ఉచితాలనేవాటిపై ఒక కమిటీని వేయాల్సి ఉందని గతంలోనే సుప్రీం కోర్టు ప్రకటించింది.
ఈ కమిటీలో ఉండే సభ్యుల స్వభావాన్ని బట్టి దాని నిర్ణయం ఉంటుంది. కాని కేంద్రం ఆ మేరకు చట్టం చేస్తే తప్ప దానికి కట్టుబడి ఉండాల్సిన పని ఉండదు. ఉచితాలు వాగ్దానం చేసే పార్టీల గుర్తింపు రద్దు చేయడం అప్రజాస్వామికమని ప్రకటించినందుకు సిజెఐని మెచ్చుకోవాలి, భవిష్యత్తులో మోడీ ప్రభుత్వం అటువంటి చట్టం తెచ్చినా ప్రజాస్వామిక రాజ్యాంగం ప్రకారం అది చెల్లదనే భరోసా కలిగింది.ఉచితాలనేవాటి విషయంలో పార్టీలపై తనకు ఎటువంటి అధికారం లేదని కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పష్టం చేసింది.ప్రాంతీయ పార్టీలను దెబ్బ తీసే ఉద్దేశం ఉచితాలను వ్యతిరేకించడం లో ఉంటే ఉండవచ్చు. నిరుపేద మెట్ట రైతాంగానికి ఉచిత సాగు విద్యుత్తు ఇవ్వడం కూడా మోడీ ప్రభుత్వానికి కంటగింపుగానే ఉంది. ఉచితాలకు కత్తెరవేసే పేరుతో సంక్షేమానికి గుండుసున్నా గీచే యత్నాలను ప్రతిఘటించాలి.