ఆలయ యంత్రాంగానికి పురావస్తుశాఖ లేఖ
పూరీ : ఒడిశా లోని పూరీ జగన్నాథ స్వామికి 12 వ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర, రత్నాల ఆభరణాలు ఎంతవరకు భద్రంగా ఉన్నాయన్న అనుమానాలు భక్తులను వెంటాడుతున్నాయి. ప్రాచీన నివేదికల ప్రకారం అవి సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించాలని, వాటిని లెక్కగట్టాలని భక్తులతోపాటు వివిధ సంఘాలు కోరుతున్నాయి. ఈ అమూల్య రత్నాభరణాలన్నీ ఒక రహస్య మందిరం గదిలో భద్రపర్చి ఉన్నాయి. ఇప్పుడు ఆ గది తలుపులు తెరిస్తే కచ్చితంగా లెక్కింపు జరుగుతుందని భక్తులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో రత్న భాండాగారం తెరవాలని పురావస్తుశాఖ పూరీ ఆలయ యంత్రాంగానికి సూచిస్తూ లేఖ రాసింది. 12 వ శతాబ్దం నాటి ఈ భాండాగారం లోపలి స్థితిని అధ్యయనం చేయాలని , మరమ్మతులు తప్పనిసరిగా చేపట్టాల్సి ఉందని అందులో పేర్కొంది. ఆలయ పాలనాధికారితోపాటు ఒడిశా రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శికి కూడా లేఖలు రాసింది. ఈ రత్న భాండాగారాన్ని చాలా కాలంగా తెరవలేదు. అందువల్ల లోపలి పరిస్థితి ఎలా ఉందో స్పష్టంగా తెలియడం లేదు.
హైకోర్టు ఆదేశాలపై భాండాగారం తలుపులు తెరవడానికి 2018 ఏప్రిల్ 4 న నిపుణుల బృందం ప్రయత్నించినా ఆ రహస్య గది తాళం చెవి లేక లోపలికి వెళ్ల లేక పోయారు. అప్పట్లో కిటికీ ద్వారానే వెలుపలి నుంచి పరిశీలించారు. పైకప్పుల పెచ్చులు ఊడడం, గోడల్లో తేమ చిమ్మడం గమనించారు. దీనిపై పురావస్తుశాఖ సమగ్ర అధ్యయనం చేపట్టింది. మరమ్మతు చేపట్టాల్సిన అవసరం ఉందని , అందుకే తలుపులు తెరవక తప్పదని యంత్రాంగానికి లేఖలో స్పష్టం చేసింది. అయితే ఈ లేఖను తానింకా చూడలేదని ఒడిశా న్యాయశాఖ మంత్రి జగన్నాథ సారక చెప్పారు. లేఖను పరిశీలించాక ఎలా తెరవాలి?ఏం చేయాలో నిర్ణయిస్తామన్నారు. ఈ భాండాగారం తలుపులు తెరవాలంటే ఆలయ పాలక వర్గంతోపాటు న్యాయశాఖ కూడా అనుమతించాల్సి ఉంటుంది. చివరిసారిగా 1978, 1982లో ఈ భాండాగారాన్ని తెరిచారు.