Monday, December 23, 2024

‘హస్త’వ్యస్తం

- Advertisement -
- Advertisement -

రేవంత్ హోంగార్డు వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా కౌంటర్ అటాక్
3 దశాబ్దాలుగా పార్టీలో హోంగార్డుగా పనిచేస్తున్నా : కోమటిరెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్‌లో ‘సారీ పాలిటిక్స్’ కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డి, అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రేవంత్ క్షమాపణలు చెప్పినప్పటికీ ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనదైన శైలిలో అసంతృప్తిని వ్యక్తపరుస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి హోం గార్డు వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ట్విట్టర్ వేదికగా శనివారం కౌంటర్ అటాక్ చేస్తూ మరోసారి మీడియా దృష్టిని ఆకర్షించారు. తమ్ముడు రాజీనామా చేసిన నాటి నుంచి తనపై రాష్ట్ర నాయకత్వం చూపుతున్న వివక్షతో అసహనంగా ఉన్నారు. సొంత పార్టీ నేతలే తమపై విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు చేయటం పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఈ విషయాన్ని తాను ఎంత సీరియస్‌గా తీసుకున్నారనే విషయాన్ని ప్రతీసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చండూరు సభలో అద్దంకి దయాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన వెంకట్‌రెడ్డి బహిరంగ క్షమాపణలు కోరారు. ఆయన కోరినట్టే అటు పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు ఆ వ్యాఖ్యలు చేసిన అద్దంకి దయాకర్ కూడా మరోసారి క్షమాపణలు తెలిపారు.

ఇదిలా ఉండగా తమను హోంగార్డులంటూ చేసిన వ్యాఖ్యలను మాత్రం వెంకట్‌రెడ్డి మనసుకు తీసుకున్నారు. పార్టీలో ఐపిఎస్‌లున్నారని వాళ్లే పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని తాము కేవలం హోంగార్డులమేనని. తమతో ఏమీ కాదంటూ వ్యంగ్యాస్త్రాలు వదిలారు. ఇవాళ ఏకంగా ఆయన ట్విటర్ ప్రొఫైల్‌లో తాను కాంగ్రెస్ హోంగార్డు అంటూ పేర్కొన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి, ప్రస్తుతం ఎంపిని అని పేర్కొంటూ మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీకి హోంగార్డుగా పనిచేస్తున్నానని తన ట్విటర్ ఖాతాలో మార్పులు చేయటం గమనార్హం. తనపై చేసిన వ్యాఖ్యల పట్ల ఇరువురూ క్షమాపణలు చెప్పినప్పటికీ కోమటిరెడ్డి ట్విటర్ ప్రొఫైల్‌లో కాంగ్రెస్‌కు హోంగార్డు అంటూ మార్పులు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత కొద్దిసేపటికే తని నిర్ణయాన్ని మార్చుకుని 3 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌కు హోంగార్డును అనే పదాన్ని తొలగించటం గమనార్హం. మరోవైపు భువనగిరిలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుందంటే తాను కూడా రాజీనామా చేస్తానని అన్నారు. అద్దంకి దయాకర్‌పై ఫిర్యాదును అధిష్ఠానం చూసుకుంటుందన్న వెంకటరెడ్డి రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పడం శుభపరిణామమన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే టిఆర్‌ఎస్ సర్కార్ వరాలు కురిపిస్తుందని విమర్శించారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రేవంత్ క్షమాపణలు

ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. పత్రికా సమావేశంలో హోంగార్డ్ ప్రస్తావన, చండూరులో జరిగిన కాంగ్రెస్ సభలో వ్యాఖ్యలపై రేవంత్ క్షమాపణ చెప్పారు. ఈ మేరకు రేంత్ రెడ్డి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. చండూరు సభలో అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు సరికాదని అన్నారు. “కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి అద్దంకి దయాకర్ పరుషమైన పదజాలం వాడటంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. పిసిసి అధ్యక్షుడిగా నన్ను సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో నేను బేషరతుగా క్షమాపణ చెబుతున్నాను. ఇలాంటి చర్య, భాష ఎవరికీ మంచిది కాదు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అవమానించేలా ఇలా మాట్లాడటం తగదు. తదుపరి చర్యల కోసం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డికి సూచన చేయడం జరుగుతుంది” అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

వెంకట్‌రెడ్డికి అద్దంకి మరోసారి క్షమాపణలు

కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మరోసారి క్షమాపణలు చెప్పారు. చండూరు సభలో చేసిన వ్యాఖ్యలు బాధపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఔన్నత్యంతో తన తరపున క్షమాపణలు చెప్పారని సోదర భావంతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీ కోసం పనిచేయాలని కోరారు. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు రాత పూర్వకంగా క్షమాపణ చెబుతూ వివరణ ఇచ్చినట్లు తెలిపారు. బహిరంగ క్షమాపణ కూడా చెప్పినట్లు అద్దంకి దయాకర్ పేర్కొన్నారు.‘చండూరు బహిరంగ సభలో తాను చేసిన వ్యాఖ్యల పట్ల ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మరోసారి క్షమాపణలు చెబుతున్నాను. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాను. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ అంశంలో తన తరపున క్షమాపణలు చెప్పారు. నాయకులు అందరూ కలిసి పనిచేయాలని మరోసారి క్షమాపణలు చెప్పడం జరిగింది. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు రాత పూర్వకంగా వివరణ ఇచ్చాన’ని – అద్దంకి దయాకర్ అన్నారు.

పాదయాత్రకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఆహ్వానించాం : రాంరెడ్డి దామోదర్‌రెడ్డి

ఇదిలా ఉండగా, మునుగోడు నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే పాదయాత్రకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కూడా ఆహ్వానించామని మాజీ మంత్రి, మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తెలిపారు. పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ఎంపి వెంకట్ రెడ్డి పాదయాత్రలో పాల్గొంటారని ఆశిస్తున్నామని తెలిపారు. ఈనెల 13న సంస్థాన్ నారాయణపురం మండలం నుంచి చౌటుప్పల్ వరకు 5 వేల మందితో జరిగే అజాదీకాగౌరవ్ యాత్రలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సిఎల్‌పి నేత భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్రస్థాయి నేతలందరూ పాల్గొంటారని చెప్పారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే పాదయాత్ర సాయంత్రం 4 గంటలకు ముగుస్తుందని, అనంతరం చౌటుప్పల్‌లో సభ ఏర్పాటు చేసినట్లు వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News