బెంగళూరు: ప్రయాణికుల్లో ఒకరి మొబైల్‌కి భయభ్రాంతులకు గురిచేసిన సందేశం రావడంతో మంగళూరు నుంచి ముంబైకి వెళ్లాల్సిన విమానం ఆరు గంటలు ఆలస్యంగా బయలుదేరవలసి వచ్చింది. ఈ సందేశం రావడంతో ఆదివారం సాయంత్రం ఇండిగో విమానాన్ని ముంబై బయలుదేరడానికి అనుమతించే ముందు పోలీసులు విమానం నుంచి మొత్తం 185 మంది ప్రయాణికులను హఠాత్తుగా కిందకు దించివేసి తనిఖీలు చేయడం మొదలు పెట్టారు. ఇలా జరగడానికి కారణం ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య సరదాగా జరిగిన మొబైల్ చాటింగ్ సంభాషణే అని తరువాత బయటపడింది. ఓ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఆదివారం మంగళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. అబ్బాయి ముంబై వెళ్లేందుకు, అమ్మాయి బెంగళూరు వెళ్లేందుకు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. ముంబై వెళ్లే విమానం రాగానే అబ్బాయి వెళ్లి విమానంలో కూర్చున్నాడు. అమ్మాయేమో తన విమానం కోసం ఎదురు చూస్తోంది. ఈలోగా ఇద్దరూ మొబైల్‌లో చాటింగ్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా విమానాల్లో భద్రత గురించి సరదాగా మాట్లాడుకుంటూ.. “నువ్వే ఓ బాంబర్” అంటూ ఆ అమ్మాయి అబ్బాయికి మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ విమానంలో అబ్బాయి వెనుక సీట్లో కూర్చున్న తోటి ప్రయాణికురాలి కంట బడింది. దీంతో ఆమె వెంటనే విమానసిబ్బందికి తెలియచేయడంతో వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌ను అప్రమత్తం చేవారు. దీంతో విమానం బయలుదేరకుండా ఆగిపోయింది. సిబ్బంది తనిఖీలు చేపట్టి ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కన్పించక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ తరువాత చాటింగ్ చేసిన అమ్మాయి, అబ్బాయిలను పోలీసులు కొన్నిగంటల పాటు విచారించగా, అది కేవలం సరదా సంభాషణే అని తేలింది. ఇదంతా జరిగేసరికి విమానం బయలుదేరడంలో ఆరుగంటలు ఆలస్యమైంది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆ విమానం ముంబై బయలుదేరింది. అయితే అది ఫ్రెండ్లీ చాటింగ్ అని తేలడంతో ఎవరూ ఫిర్యాదు చేయలేదు.
Flight delayed due to Suspicious Chatting in Mangalore Airport