న్యూఢిల్లీ : ఎలక్ట్రిక్ కారు విభాగంలోకి ప్రవేశిస్తున్నట్టు ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది. తొలి ఎలక్ట్రిక్ కారును 2024లో ఆవిష్కరించనున్నట్టు తెలిపింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ తన మొదటి ఎలక్ట్రిక్ కారును తీసుకురానున్నట్లు ప్రకటించింది. కంపెనీ సిఇఒ భవిష్ అగర్వాల్ ఎలక్ట్రిక్ కారు వివరాలను వెల్లడించారు. ఈ కారు రేంజ్ 500 కి.మీ ఉంటుందని, 4 సెకన్లలో 0100 కెఎంపిహెచ్ సామర్థం కల్గివుండనుందని అన్నారు. ఓలా తొలి కారులో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనున్నామని, ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో తయారవుతున్న తొలి స్పోర్ట్ కారు ఇదేనని అన్నారు.
కంపెనీ ఓలా ఎస్1ని మార్కెట్లోకి విడుదల చేసింది. కొత్త ఓలా ఎస్-1 స్కూటర్ బుకింగ్ ప్రారంభించామని, రూ.499 చెల్లించి బుక్ చేసుకోవచ్చని భవిష్ తెలిపారు. కొత్త ఇ-స్కూటర్ డెలివరీలు సెప్టెంబర్ 7 నుండి ప్రారంభమవుతాయి. ఓలా ఎస్1 ప్రారంభ ధర రూ.99,999గా ఉంటుందని కంపెనీ ఆయన తెలిపారు. ఇది 5 రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఇందులో నియో మింట్, పోర్సిలిన్ వైట్, కోరల్ గ్లామ్, జెట్ బ్లాక్, లిక్విడ్ సిల్వర్ కలర్స్ ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ బ్యాటరీ కారుతో పాటు ఓలా కొత్త ఎలక్ట్రిక్ బ్యాటరీని కూడా కంపెనీ ప్రదర్శించింది. ఇది ఓలా ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లలో ఉపయోగపడుతుంది. ఇది లిథియం-అయాన్ బ్యాటరీ, అన్ని పరీక్ష ప్రక్రియలు పూర్తయిన తర్వాత ఈ బ్యాటరీలు వచ్చే ఏడాది నాటికి ఓలా వాహనాలకు అమర్చుతారు.