కరీంనగర్: నగరంలో ఘనంగా సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు. ఈ గీతాలాపనలో ముఖ్య అతిథులుగా మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు. విద్యార్థులు, నగరవాసులతో కలిసి ముఖ్య అతిథులు సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా 15 రోజులపాటు ఉత్సవాలను నిర్వహించుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ… నేటి తరానికి స్వాతంత్ర ఉద్యమం గురించి స్పష్టమైన అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొంతమంది కుహనా వాదులు చరిత్రను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. స్వాతంత్ర పోరాట యోధులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ… మహాత్మా గాంధీ చరిత్రను వక్రీకరిస్తున్నారు. మహాత్మా గాంధీ చరిత్రను నేటితరానికి తెలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం అన్ని థియేటర్లలో మహాత్మా గాంధీ సినిమాను ప్రదర్శిస్తున్నామని చెప్పారు. వచ్చే 25 సంవత్సరాల కాలం చాలా ముఖ్యమైనదన్నారు.
భారతదేశ స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాల నాటికి ఇండియా సాఫ్ట్ సూపర్ పవర్ గా ఎదగాలని ఆకాంక్షించారు. సూపర్ పవర్ అంటే అమెరికా రష్యా దేశాలు అని… ఆర్మ్స్.. అణ్వస్త్రాలు… జెట్ విమానాలు… బాంబర్స్ ఉంటేనే సూపర్ పవర్ దేశాలు అని మేము చదువుకున్నామన్నారు. 25 సంవత్సరాల వరకు భారతదేశం సూపర్ సాఫ్ట్ పవర్ కావాలన్నారు. సూపర్ సాఫ్ట్ పవర్ అంటే విద్యా… విజ్ఞానం… వ్యవసాయం… ఇండస్ట్రీస్… భారత దేశాన్ని సూపర్ సాఫ్ట్ పవర్ గా తీర్చి దిద్దుకునేందుకు ప్రతి ఒక్కరు కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. 8 సంవత్సరాల తెరాస పాలనలో… వెనుకబడిన తెలంగాణ అభివృద్ధి సాధించి… యావత్ దేశానికి దిక్సూచిగా నిలిచిందని గుర్తుచేశారు. భారతదేశాన్ని గొప్ప దేశంగా తీర్చిదిద్దుకునేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శాంతి భద్రతలు ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. కొంతమంది మతోన్మాదాన్ని… విచ్చలవిడితనాన్ని పెంచి పోషిస్తున్నారు. మనిషి మనిషి మధ్య మానవత్వం… ప్రేమ సుహృద్భావ వాతావరణం నెలకొన్నప్పడే శాంతిభద్రతలు సాధ్యపడతాయి, అప్పుడే భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.