Monday, December 23, 2024

సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్న సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR participated in mass recital of National Anthem

హైదరాబాద్: స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా మంగళవారం అబిడ్స్ లోని నెహ్రూ సర్కిల్‌లో నిర్వహించిన ‘‘ తెలంగాణ రాష్ట్ర సామూహిక జాతీయ గీతాలాపన’’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వజ్రోత్సవ కమిటీ చైర్మన్ ఎంపీ కే కేశవరావు, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు మధుసూధనాచారి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బేతి సుభాష్ రెడ్డి, ఏ జీవన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, పలు సంస్థల చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ముందుగా…. ఆబిడ్స్ చౌరస్తాలోని నెహ్రూ విగ్రహం వద్దకు సిఎం కెసిఆర్ చేరుకున్నారు. 75 ఏండ్లు పూర్తి చేసుకుంటున్న పండుగ వాతావరణంలో, స్వతంత్ర భారత వజ్రోత్సవ వేళ, శాంతి పావురాన్ని ఎగరవేస్తున్న భారత దేశ మొట్టమొదటి ప్రధాని నెహ్రూ విగ్రహానికి సిఎం పుష్పాంజలి ఘటించారు. ఆ తరువాత అక్కడే గుమికూడిన వేలాది మంది ప్రజలకు సిఎం కెసిఆర్ అభివాదం చేశారు. అనంతరం వేదికమీదకు చేరుకున్నారు. వేదిక మీద నుంచి నిర్దేశిత సమయం (11.30) లో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించారు. సిఎంతో పాటు వేదిక మీద వున్న కె.కేశవరావుతో సహా పలువురు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు సిఎస్ సహా ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు. చౌరస్తాకు నలు దిక్కులా, పలు అంతస్థుల భవనాల మీదనుంచి సిద్ధంగా వున్న వేలాది మంది జన సమూహం, సిఎం కెసిఆర్ తో గొంతు కలిపి ముక్త కంఠంతో ‘ జన గణ మన అధినాయక జయహే…’ అంటూ ఏకోన్ముఖులై జాతీయ గీతాన్ని ఆలపించారు. దాంతో ఆబిడ్స్ నెహ్రూ చౌక్ జాతీయ గీతాలపనతో ప్రతిధ్వనించింది. ఆ ప్రాంతమంతా దేశభక్తి ఉప్పొంగింది. “బోలో స్వతంత్ర భారత్ కీ జై” నినాదంతో నెహ్రూ చౌరస్తా ప్రాంగణం మారుమోగింది. అదే సమయంలో ఏక కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎక్కడి వారు అక్కడే నిలబడి దేశభక్తి ప్రజ్వరిల్లగా భరతమాత మది పులకించేలా..‘తెలంగాణ రాష్ట్ర సామూహిక జాతీయ గీతాన్ని’ ఆలపించారు. గీతాలాపన ముగియగానే…జై భారత్…భారత్ మాతా కీ జై…జై తెలంగాణ…అనే నినాదాలు చేస్తూ, సీఎం కేసీఆర్‌ పిడికిలెత్తి నినదించారు. నెహ్రూ విగ్రహం సాక్షిగా సిఎం కెసిఆర్ తో వేలాది గొంతులు ..‘ భారత్ మాతా కీ జై…’ అంటూ ముక్తకంఠంతో నినదించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News