రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్
గౌలిదొడ్డి గురుకులంలో గీతాలాపన కార్యక్రమంలో మంత్రి కొప్పుల
హైదరాబాద్ : ఎంతో మంది మహానీయుల త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్రం సిద్దించిందని సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బ్రిటీష్ పాలనలో మన పూర్వీకులు దయనీయ జీవితాలు గడిపారని తెలిపారు. ఈ 75 ఏళ్ళలో దేశం ఎంతగానో అభివృద్ధి చెందిందని, చాలా మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. నగర శివార్లలోని గౌలిదొడ్డి ఎస్‌సి గురుకుల కళాశాలలో జాతీయ గీతాలాపన కార్యక్రమానికి మంత్రి కొప్పుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఉత్సాహభరితంగా జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఈ మువ్వన్నెల జెండా మన ఆత్మగౌరవానికి ప్రతీక అని వ్యాఖ్యానించారు. గాంధీజీ సూచించిన అహింసా మార్గంలో నడిచిన ఆ స్వాతంత్రోద్యమ స్పూర్తితోనే కెసిఆర్ ఉద్యమాన్ని ఉరకలెత్తించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, ప్రజల చిరకాల వాంఛను నేరవేర్చారని అన్నారు. అదే ధృఢ సంకల్పంతో అన్ని రంగాలలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. అనేక అంశాలలో దేశం మొత్తానికి మన రాష్ట్రం దిక్సూచిగా మారిందన్నారు. ఇందుకు మన గురుకులాలు ప్రబల నిదర్శనమని మంత్రి చెప్పారు. గురుకులాలు సాధిస్తున్న అత్యుత్తమ ఫలితాలు, విజయాలు మనందరికి గర్వకారణంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆలపించిన పాటలు, ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆలరించాయి.