న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండడంతో హాస్పిటల్‌లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోందని అధికారులు మంగళవారం తెలిపారు. కొవిడ్19 జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. పాజిటివ్ కేసులు, రీఇన్‌ఫెక్షన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని తెలుస్తోంది. ఢిల్లీ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సైతం ప్రజలను అప్రమత్తం చేస్తూ ట్వీట్ చేశారు. సోమవారం నాటికి ఢిల్లీలో పాజిటివిటీ రేటు 14.57 శాతంగా ఉంది. దాంతో పాటు ఎనిమిది మంది చనిపోయారు. ఈ వివరాలను ఆరోగ్య శాఖ డేటా తెలిపింది. గత 12 రోజుల్లో 2వేలకు పైగా వ్యాధిగ్రస్తులయ్యారు.
లాన్సెట్ కమిషన్ సభ్యురాలు, ప్రజారోగ్య నిపుణురాలు డాక్టర్ సునీలా గర్గ్ మాట్లాడుతూ “రికవరీ రేటు బాగానే ఉంది. కానీ కేసులు పెరుగుతున్నాయి, ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. 9000 బెడ్లలో 500 బెడ్లు నిండాయి. 2129 ఐసియూ బెడ్లలో 20 నిండాయి. ప్రస్తుతం వెంటిలేషన్‌పై 65 మంది రోగులున్నారు. అయితే కంగారు పడాల్సిందంటూ ఏమీ లేదు. కానీ జాగ్రత్తలు తీసుకోవాలి” అని తెలిపారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గత వారం కేసులు పెరుగుతున్నప్పటికీ కంగారు పడాల్సిందంటూ ఏమి లేదన్నారు. చాలా వరకు మైల్డ్ కేసులేనన్నారు. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఢిల్లీ విపత్తు అధికారులు ఇప్పటికీ గార్డెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(జిఆర్‌ఎపి)ని అమలుచేస్తామని ప్రకటించలేదు. జిఆర్‌ఎపి అనేది గత ఏడాది ఆగస్టులో అమలులోకి వచ్చింది.