న్యూఢిల్లీ: ముస్లింలలో విడాకులు తీసుకోవడానికి పాటించే తలాఖ్‌ఎ హసన్ విధానం, ట్రిపుల్‌తలాఖ్ ఒక్కటి కాదని, ‘ఖులా’ ద్వారా మహిళలు భర్తనుంచి విడాకులు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. మూడు నెలల పాలు నెలకో సారి తలాఖ్ చెప్పడం ద్వారా విడాకులు తీసుకునే విధానాన్ని తలాఖ్‌ఎ హసన్ అంటారు. అయితే ఈ మూడు నెలల కాలంలో భార్యాభర్తలు తిరిగి ఒక్కటి కాకుండా ఉండాలి. అలా కాక మధ్యలో వీరు కలిసి ఉండాలని భావిస్తే అంతకు ముందు చెప్పిన తలాఖ్‌లు చెల్లుబాటు కావు. ఇస్లాం మతంలో పురుషుడు తలాఖ్ ద్వారా విడాకులు తీసుకుంటే హిళ ‘ఖులా’ పద్ధతి ద్వారా భర్తనుంచి వేరుపడవచ్చు. అంతేకాదు భార్యాభర్తలు కలిసి జీవించలేనప్పుడు రాజ్యాంగంలోని 142 అధికరణం కింద పునరుద్ధరించడానికి వీలుకాని బంధం కారణంకింద కూడా కోర్టులు విడాకులు మంజూరు చేయవచ్చని న్యాయమూర్తులు జస్టిస్ ఎస్‌కు కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. తలాఖ్‌ఎ హసన్ సహా ముస్లిం విడాకుల విధానాలన్నీ కూడా ఏకపక్షమైనవి, అహేతుకమైనవే కాక, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేవిగా ఉన్నందున వాటినన్నిటినీ రాజ్యాంగ వ్యతిరేకమైనవిగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. యుపిలోని ఘజియాబాద్‌కు చెందిన హీనా అనే మహిళ ఈ పిటిషన్ దాఖలు చేసింది.
తలాఖ్‌ఎ హసన్ బాధితురాలినని చెప్పుకొన్న ఆమె దేశంలోని పౌరులందరికీ విడాకులకు సంబంధించి ఒకే విధమైన మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించాలని ఆమె తన పిటిషన్‌లో కోరారు. సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాఖ్’ను రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రకటించినప్పటికీ తలాఖ్‌ఎ హసన్ విషయంలో ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది పింకీ ఆనంద్ వాదించారు. అయితే వివాహ సమయంలో వధువు తరఫు వారు వరుడికి ఇచ్చే ‘మెహర్’(కట్నకానుకలకు) మించి సొమ్ము ఇస్తే విడాకులకు పిటిషనర్ అంగీకరిస్తుందేమో తెలుసుకోవాలని బెంచ్ పింకీ ఆనంద్‌ను కోరింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.
Talaq e Hasan not akin to Triple Talaq: Supreme Court