కొలంబో : భారత్, అమెరికా దేశాలు ఎంతగా ఆందోళన వ్యక్తం చేసినా, శ్రీలంక బేఖాతరు చేస్తూ అనుమతులు ఇవ్వడంతో చైనా నిఘా నౌక “యువాన్ వాంగ్5”మంగళవారం ఉదయం 8.30 గంటల సమయంలో హంబన్‌టొట రేవుకు చేరుకొంది. శ్రీలంక రేవుకు నౌక చేరుకున్న కొన్ని గంటల తరువాత తాము అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగానే సాగరగర్భ శాస్త్రీయ పరిశోధన కార్యకలాపాలను నిర్వహిస్తున్నామని , దీని ప్రభావం ఏ దేశ భద్రతా ప్రయోజనాలపై ఉండబోదని చైనా ప్రకటించింది. కొలంబో అధికార వర్గాల సమాచారం ప్రకారం హిందూ మహాసముద్ర రీజియన్‌లో నౌకల సైనిక సామర్ధాలను ఉటంకిస్తూ భారత్, అమెరికా దేశాలు రెండూ తమ ఆందోళనలను శ్రీలంక ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ అందోళనలపై చైనా విదేశీ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ స్పందిస్తూ యువాన్ వాంగ్ నౌక సాగర పరిశోధనలకే అంతర్జాతీయ చట్టం ప్రకారం పరిమితమౌతుందని,ఇందులో మూడో పక్షం జోక్యం చేసుకోరాదని స్పష్టం చేశారు. ఏదేశం భద్రత, ఆర్థిక ప్రయోజనాలపై దీని ప్రభావం ఉండబోదని వివరించారు. అంతకు ముందు భారత్ భయాందోళనలపై చైనా అవి అన్యాయం,నైతికంగా బాధ్యతారాహిత్యం అని విమర్శించింది.
భారత్, చైనా దేశాల మధ్యనున్న సాధారణ పరస్పర అవగాహనలకు భంగం కానీయ రాదని హెచ్చరించింది. భారత్ “నిరాకరణల తిరస్కరణలు” శ్రీలంకపై ఒత్తిడి తెచ్చాయి. ఈ నౌక రాకను కొన్ని వారాల ముందే పసిగట్టిన భారత్ తక్షణమే స్పందించి శ్రీలంకకు అభ్యంతరాలను తెలియజేసింది. దీనిపై శ్రీలంక స్పందించి యువాన్ వాంగ్ 5 ప్రయాణాన్ని వాయిదా వేయాలని చైనా అధికారులను కోరింది. శ్రీలంక అభ్యర్థన మేరకు ఈ ప్రయాణం వాయిదా పడినట్టు ప్రచారం జరిగినా మొదట అనుకున్న ప్రకారం నౌక హంబన్‌టొట రేవుకు చేరుతుందని, అక్కడ వారం రోజులపాటు ఉంటుందని చైనా ప్రకటించింది. అవసరమైన ఇంధనం, ఇతర అవసరాలు నింపడానికి యువాన్‌వాంగ్ నౌకకు కొంత సమయం పడుతుందని బీజింగ్‌లో వాంగ్ వెల్లడించారు. అయితే శ్రీలంక జలాల్లోకి ఈ నౌక ప్రవేశించిన తరువాత ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఆఫ్ చేయాలనే నిబంధనపై అనుమతి ఇచ్చినట్టు కొలంబో అధికారులు చెబుతున్నారు. లంక జలాల్లో ఎలాంటి సర్వేలు నిర్వహించడానికి అనుమతించబోమని పేర్కొన్నారు. ఆగస్టు 16 22 మధ్యలో కేవలం ఇంధనం నింపుకోవడానికి మాత్రమే అనుమతి ఇచ్చామని వివరించారు.