హైదరాబాద్: దేశంలో ఉన్న ప్రధాన సమస్యలైన పేదరికం, నిరుద్యోగం, మతతత్వాన్ని సమూలంగా రూపుమాపితే, స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యేలేపు భారతదేశం, ప్రపంచంలో నంబర్ వన్ శక్తిగా ఎదిగే ఆస్కారం ఉంటుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగర శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను ఉచితాలంటూ కేంద్రం విమర్శించడం సరైంది కాదన్నారు.
పేదలు అభివృద్ధి చెందాలంటే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టే పథకాలపై కేంద్రం విమర్శలు చేయడం సరైంది కాదని హితువు పలికారు. సిఎం కెసిఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని కవిత పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఏ విధంగా మార్చాలనే అంశంపై దేశ పౌరులందరూ ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. దేశ అభ్యున్నతి కోసం మనమంతా పునరంకితమవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపి కేశవరావు, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కార్పొరేషన్ చైర్మన్లు మేడే రాజీవ్ సాగర్, గజ్జెల నగేష్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, విప్లవ్ రెడ్డి తదితరుల పాల్గొన్నారు.