ఢిల్లీ హైకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: బిజెపి నేత సయ్యద్ షానవాజ్ హుసైన్ 2018 ఏప్రిల్ నెలలో దక్షిణ ఢిల్లీకి చెందిన ఛతర్‌పూర్ ప్రాంతంలోని ఫామ్‌హౌస్‌లో బలత్కారం చేశాడంటూ ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వు జారీచేసింది. న్యాయమూర్తి ఆశా మీనన్ ‘ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం, దర్యాప్తు మొదలెట్టడంలో ఎందుకింత నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు’ అని ఢిల్లీ పోలీసులను ప్రశ్నించింది. మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి పూర్తి నివేదికను కోర్టుకు సమర్పించాలిని కూడా న్యాయమూర్తి ఆగస్టు 17న ఆదేశించింది. బలత్కారానికి గురైన మహిళ 2018 జూన్ 18వ తేదీనే ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్య తీసుకోలేదని తెలిసింది. అయితే ఆ మహిళ చేసిన ఫిర్యాదు బలంగా లేదంటూ ఢిల్లీ పోలీసు కోర్టుకు నివేదించింది.
ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని తన మీద ఒత్తిడి కూడా వస్తోందని, అయితే అలాంటి ఒత్తిడులకు తాను తలవొగ్గబోనని ఆ మహిళ మరో వినతిని సమర్పించుకుంది. కింది కోర్టు ఎఫ్ఐఆర్ నమోదుచేయమన్నప్పటికీ పోలీసులు ఇంత వరకు ఎలాంటి చర్యలు చేపట్టనందున తాను మరోసారి విచారణ కోర్టుకు దరఖాస్తు చేసుకుంటున్నట్లు ఆమె పేర్కొంది.
న్యాయమూర్తి మీనన్ తన 14 పేజిల తీర్పులో కమిషనర్ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషనుకు ఫిర్యాదు అందినప్పటికీ ఎలాంటి దర్యాప్తు జరగలేదని, విచారణ కోర్టు ఆదేశించేంత వరకు ఎలాంటి పూనిక చేపట్టలేదని పేర్కొన్నారు. నాలుగు సందర్భాలలో ఆ మహిళ నుంచి వాంగ్మూలం తీసుకున్నప్పటికీ ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలేదని కోర్టుకు సమర్పించిన స్టేటస్ రిపోర్టు ఆధారంగా న్యాయమూర్తి నిర్ధారించారు. ‘దర్యాప్తుకు ఎఫ్‌ఐఆర్ పునాది అని, దర్యాప్తు ఆధారంగానే నేరం జరిగిందా లేదా అనే ముగింపుకు రావడం జరుగుతుందని’ హైకోర్టు తెలిపింది. ‘ప్రస్తుత కేసులో ఎఫ్‌ఐఆర్ వంటిది కూడా నమోదు కాకపోవడం పోలీసుల నిర్లక్షంను చూపుతోందని, ఎఫ్‌ఐఆర్ లేకుండా పోలీసులు ప్రాథమిక విచారణ మాత్రం చేపట్టి ఉంటారని కోర్టు భావిస్తోందని’ ప్రత్యేక న్యాయమూర్తి తెలిపారు.