హరారే: జింబాబ్వేతో గురువారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులుకు ఆలౌటైంది. తర్వాత లక్షఛేదనకు దిగిన భారత్ 30.5 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ అజేయ అర్ధ శతకాలతో టీమిండియాకు పది వికెట్ల విజయాన్ని సాధించి పెట్టారు. ఇక అద్భుత బౌలింగ్‌తో జింబాబ్వే ఇన్నింగ్స్ పతనాన్ని శాసించిన దీపక్ చాహర్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం జరుగుతుంది.
గిల్, ధావన్ జోరు..
ఇక సునాయాస లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్‌లు శుభారంభం అందించారు. ఇద్దరు జింబాబ్వే బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. గిల్ ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు. ధావన్ సమన్వయంతో ఆడుతూ అతనికి సహకారం అందించాడు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. భారత ఓపెనర్లు అద్భుత బ్యాటింగ్‌తో జట్టును విజయం దిశగా నడిపించారు. ఇక జింబాబ్వే బౌలర్లు వికెట్ల కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన గిల్ కుదురుకున్న తర్వాత దూకుడును పెంచాడు. తన మార్క్ షాట్లతో స్కోరును పరిగెత్తించాడు. ధావన్ కూడా క్లాస్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇదే క్రమంలో ఇద్దరు అర్ధ సెంచరీలు సయితం పూర్తి చేసుకున్నారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ధావన్ 113 బంతుల్లో 9 ఫోర్లతో 81 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న గిల్ 72 బంతుల్లోనే 10 బౌండరీలు, ఒక సిక్సర్‌తో అజేయంగా 82 పరుగులు సాధించాడు. దీంతో భారత్ మరో 19.1 ఓవర్లు మిగిలివుండగానే ఒక్క వికెట్ కూడా నష్టపోకుండానే జయకేతనం ఎగుర వేసింది.
దీపక్ చాహర్ మాయ..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన జింబాజ్వేకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. భారత ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ అద్భుత బౌలింగ్‌తో జింబాబ్వే బ్యాట్స్‌మెన్‌లను హడలెత్తించాడు. ఈ క్రమంలో జింబాబ్వే ఓపెనర్లు ఇన్నొసెంట్ కైయా (4), తాడివనాశె మరుమన్ (8)లను చాహర్ వెనక్కి పంపాడు. ఆ వెంటనే సీన్ విలియమ్స్ (1) సిరాజ్ ఔట్ చేశాడు. ఇక స్టార్ బ్యాటర్ వెస్లీ మధెవెర్ (5) దీపక్ ఔట్ చేయడంతో జింబాబ్వే 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో కెప్టెన్ చకబ్వా (35) కొద్ది సేపు పోరాటం చేశాడు. ఇక చివర్లో బ్రాడ్ ఎవాన్స్ 33(నాటౌట్), రిచర్డ్ గరావా(34) తొమ్మిదో వికెట్‌కు రికార్డు స్థాయిలో 70 పరుగులు జోడించారు. దీంతో జింబాబ్వే స్కోరు 189 పరుగులకు చేరింది.
India win by 10 wickets against Zimbabwe