Monday, December 23, 2024

సిరీస్‌పై భారత్ కన్ను

- Advertisement -
- Advertisement -

జింబాబ్వేకు పరీక్ష, నేడు రెండో వన్డే

Team India play with Zimbabwe in 2nd ODI

హరారే: ఇప్పటికే తొలి వన్డేలో పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా ఈసారి సిరీస్‌పై కన్నేసింది. శనివారం జరిగే రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో భారత్ పోరుకు సిద్ధమైంది. ఇక మొదటి మ్యాచ్‌లో ఓడిన జింబాబ్వేకు ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. సిరీస్‌లో నిలవాలంటే విజయం తప్పించి మరో మార్గం లేకుండా పోయింది. అయితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా బలంగా ఉన్న టీమిండియాను ఓడించాలంటే సర్వం ఒడ్డి పోరాడక తప్పదు. మరోవైపు తొలి మ్యాచ్‌లో రికార్డు విజయం అందుకున్న టీమిండియా ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. మొదటి మ్యాచ్‌లో బౌలర్లు అసాధారణ రీతిలో రాణించారు.

స్పీడ్‌స్టర్ దీపక్ చాహర్ ఆరంభంలోనే కీలకమైన వికెట్లు తీసి జింబాబ్వేను కోలుకోలేని దెబ్బతీశాడు. ఈ మ్యాచ్‌లో కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. దీపక్ చాహర్ మరోసారి విజృంభిస్తే ఈ మ్యాచ్‌లో కూడా జింబాబ్వేకు ఇబ్బందులు తప్పక పోవచ్చు. తొలి మ్యాచ్‌లో మూడేసి వికెట్లతో చెలరేగిన ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్‌లు కూడా జట్టుకు కీలకంగా మారారు. ఈసారి కూడా వీరి నుంచి మెరుగైన ప్రదర్శనను జట్టు ఆశిస్తోంది. హైదరాబాదీ యువ సంచలనం సిరాజ్ కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. మొదటి వన్డేలో సిరాజ్ కూడా బాగానే బౌలింగ్ చేశాడు.

కాగా, ప్రసిద్ధ్ వికెట్లు తీసినా పరుగులు ఎక్కువగా సమర్పించుకోవడం కాస్త ఆందోళన కలిగించే పరిణామంగా చెప్పాలి. మరోవైపు బౌలర్లతో పాటు మొదటి వన్డేలో ఓపెనర్లు కూడా సత్తా చాటారు. శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్‌లు అజేయ అర్ధ సెంచరీలతో రాణించడంతో జింబాబ్వే ఉంచిన 190 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే ఛేదించింది. కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన ధావన్ (81), గిల్ (82) పరుగులతో అజేయంగా నిలిచారు. దీంతో భారత్ 30.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో కూడా మెరుపులు మెరిపించేందుకు ధావన్, గిల్‌లు సిద్ధంగా ఉన్నారు. అంతేగాక కెప్టెన్ రాహుల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సంజు శాంసన్, అక్షర్, దీపక్ చాహర్ తదితరులతో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఈ పరిస్థితుల్లో రెండో మ్యాచ్‌లో కూడా టీమిండియాకే గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయని చెప్పాలి.

గెలిచి తీరాల్సిందే..

మరోవైపు ఆతిథ్య జింబాబ్వేకు రెండో వన్డే చా లా కీలకంగా మారింది. సిరీస్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే. అయితే భారత బౌలర్లు జోరుమీదుండడం జింబాబ్వేను కలవరానికి గురి చేస్తోం ది. తొలి మ్యాచ్‌లో విఫలమైన ఓపెనర్లు ఇన్నొసెంట కైయా, మరుమాని, స్టార్ బ్యాటర్లు మధెవెర్, సీన్ విలియమ్స్, సికందర్ రజా తదితరులు తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిందే. కెప్టెన్ చకబ్వా కూడా రాణించక తప్పదు. అప్పుడే ఈ మ్యాచ్ లో జింబాబ్వేకు గెలుపు అవకాశాలు ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News