పాట్నా : బీహార్‌లో ఆర్జేడీ పొత్తుతో నితీశ్ కుమార్ (జేడీయా) నేతృత్వంలో ఇటీవలే కొత్త ప్రభుత్వం ఏర్పడింది. సుమారు 30 మంది మంత్రివర్గంలో చేరారు. వీరిని ఉద్దేశిస్తూ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కొన్ని సూచనలు చేశారు. ‘ఇలా సవరించాలి. అలా చేయొద్దు’ అంటూ ఆర్జేడీ మంత్రులకు ఒక నియమావళిని సిద్దం చేశారు. పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వండి. బొకేలకు బదులు పుస్తకాలు, పెన్నులు ఇచ్చేలా చూడండి. ఆర్జేడీ నుంచి ఎన్నికైన మంత్రులు వారి కోసం వాహనాలు కొనుగోలు చేయొద్దు. మంత్రులంతా ప్రతి ఒక్కరితో మర్యాదగా ప్రవర్తించాలి. నమసే ఆదాబ్ చెబ్తూ … మన సంప్రదాయాన్ని ప్రోత్సహించాలి.
కార్యకర్తలు, మద్దతుదారులు పాదాలను సమస్కరించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించొద్దు. ప్రజల సమస్యలు పరిష్కరించే విషయంలో కులం, మతం ప్రాతిపదిక కావొద్దు. అలాగే మంత్రులు తమ విధులకు సంబంధించి ప్రణాళికను, అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలి. దాంతో ప్రజలకు మన నుంచి సానుకూల సమాచారం అందుతుంది ’ అని తన మంత్రులకు తేజస్వి దిశా నిర్దేశం చేశారు. ఆర్జేడీ విషయంలో బీజేపీ చేస్తున్న ఆటవిక రాజ్యం విమర్శలను తిప్పి కొట్టేందుకు పార్టీకి ప్రజల్లో మంచి పేరు తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నంగా ఈ సూచనలు కనిపిస్తున్నాయి. మరో వైపు ఓ స్వతంత్ర అభ్యర్థి కూడా ఆర్జేడీ జేడీయూ కూటమిలో చేరడంతో ఎమ్‌ఎల్‌ఎల సంఖ్యాబలం 164కు పెరిగింది. ఈ సంకీర్ణ ప్రభుత్వం ఆగస్టు 24 న బలపరీక్షను ఎదుర్కొనున్నది.