సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేష్ వెల్లడి
ముగ్గురు నేతల పేర్లలో తెలంగాణ నేత
మిగిలిన వారు మమత , పవార్
లక్నో /న్యూఢిల్లీ : 2024 దేశ సార్వత్రిక ఎన్నికలలో ప్రధాని పదవికి విపక్ష అభ్యర్థిగా ఎక్కువ అవకాశాలు ఉన్న వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి , టిఆర్‌ఎస్ అధినేత కె చంద్రశేఖర రావు కూడా ఉన్నారు. ప్రధాని పదవికి ముగ్గురు అభ్యర్థుల అవకాశాల గురించి సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ శనివారం తెలిపారు. కెసిఆర్, తృణమూల్ కాంగ్రెస్ నేత మమత బెనర్జీ, ఎన్‌సిపి నేత శరద్ పవార్ ప్రధాని పదవికి పోటీకి అర్హులుగా ఉండే అభ్యర్థులని తాను భావిస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రధాని మోడీకి పోటీగా విపక్షాల తరఫున వీరిలో ఒకరిని ఎంచుకోవల్సి ఉంటుందన్నారు. పిఎం పదవికి అఖిలేష్ కూడా ఓ అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశం ఉందని ఇటీవలి కాలంలో ప్రచారం జరిగింది.
అయితే తాను ఈ పోటీలో లేనని, తాను తన స్వరాష్ట్రం యుపి రాజకీయాలపైనే దృష్టి పెడుతానని అఖిలేష్ స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో బీహార్ సిఎం నితీశ్‌కుమార్ ప్రధాని పదవికి మోడీతో పోటీ పడుతారని, విపక్షాల తరపున ఆయన పట్ల ఏకాభిప్రాయం ఏర్పడుతుందని భావిస్తూ వచ్చారు. అయితే ఆయన పేరును అఖిలేష్ ప్రస్తావించలేదు. ప్రతిపక్షాలు ముందుగానే తాను పేర్కొన్న ముగ్గురిలో ఒకరిని తమ ప్రధాని అభ్యర్థిగా పేర్కొని ఎన్నికలకు వెళ్లితే విపక్షాలకు అధికార వేదిక దక్కుతుందని ఆయన తెలిపారు. ఈ దశలో ఆయన ప్రతిపక్ష ఐక్యత ప్రధానం అనే విషయాన్ని స్పష్టం చేశారు.