ఆగస్టు 12 వారాంతానికి 2బిలియన్ డాలర్ల క్షీణత
న్యూఢిల్లీ: రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాలర్లను విక్రయించడంతో విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గుముఖం పట్టాయి. ఆగస్టు 12నాటికి రెండు బిలియన్ల డాలర్లకు విదేశీ మారక నిల్వలు క్షీణించాయి. డాలరు విలువ భారత కరెన్సీలో రూ.80కంటే తక్కువగా ఉంచేందుకు భారత సెంట్రల్ బ్యాంకు చర్యలు చేపట్టింది. పతనాన్ని నిలువరించి స్థిరత్వం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ విడుదల చేసిన వీక్లీ సప్లిమెంట్ డేటా ప్రకారం ఆగస్టు 12వారాంతానికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు 570.74 బిలియన్ డాలర్లకు క్షీణించాయి. విడుదల చేసిన ప్రకారం 572.978 బిలియన్ డాలర్లు ఉండగా ప్రసుత్తం రెండు బిలియన్ల డాలర్ల మేరకు విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గాయి. ఈ పరిమాణంలో క్షీణించడం ఈ నెలలో ఇదే ప్రథమం. రష్యా ఉక్రెయిన్‌పై దాడికి పాల్పడిన అనంతరం భారత విదేశీ మారక నిల్వలు తగ్గుముఖం పట్టాయి. ఉక్రెయిన్‌పై దాడి జరిగి 25వారాలు అవుతుండగా 19వారాలు నుంచి భారత విదేశీ నిల్వలపై ప్రభావం పడింది. అయినా ప్రపంచవ్యాప్తంగా విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్ నాలుగోస్థానంలో ఉందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. కాగా ప్రపంచవ్యాప్తంగా మారకపు విలువ ఉన్న డాలర్ ఇతర మేజర్ కరెన్సీలపై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.