ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రసంగాల టీవీ ప్రత్యక్ష ప్రసారాలపై నిషేధం విధించారు. పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా నియంత్రణ సంస్థ ( పెమ్రా) శనివారం సంబంధిత అంశంపై ఉత్తర్వులు వెలువరించింది. మాజీ ప్రధాని ప్రసంగాలు దేశంలోని అధికారిక వ్యవస్థలను బెదిరించేవిగా ఉంటున్నాయని గుర్తించి ఈ చర్య తీసుకున్నామని అధికారవర్గాలు తెలిపాయి. తనపై కేసులకు దిగే పోలీసు అధికారులు, వ్యతిరేక తీర్పులు ఇచ్చే మెజిస్ట్రేట్‌లను సహించేది లేదని , ఓ మహిళా మెజిస్ట్రేట్‌పై వ్యాజ్యానికి దిగుతానని ఇమ్రాన్ ఓ సభలో ప్రసంగిస్తూ చెప్పారు. అయితే అధికారిక వ్యవస్థల స్వేచ్ఛ, వాటి పనితీరును ప్రభావితం చేసేలా ఆయన మాటలు ఉంటున్నాయని పేర్కొన్న పెమ్రా ఇమ్రాన్ సభల ప్రత్యక్ష ప్రసారాలకు దిగరాదని టీవీఛానల్స్‌ను ఆదేశించింది. రిలేలకు దిగే సంస్థలపై తమ అధికారం పరిధిలో చర్యలు తీసుకుంటామని నోటీసులు వెలువరించింది.