డబ్బులిచ్చినా రాని జనం
మునుగోడులో ఎగిరేది గులాబి జెండాయే
సంక్షేమ మంత్రి కొప్పుల ఈవ్వర్
మన తెలంగాణ / హైదరాబాద్ : అమిత్ షా సభపై బిజెపి శ్రేణులు అమితంగా పెట్టుకున్న ఆశలు నీరు గారాయని, సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. షా ప్రసంగం పేలవంగా ఉందని, ఆయన చేసిన వ్యాఖ్యలు, విమర్శలు, నినాదాలకు సభికుల నుంచి కనీస స్పందన లభించలేదని పేర్కొన్నారు. అమిత్ షా కేవలం 15 నిముషాల్లోనే ప్రసంగాన్ని ముగించుకుని వెనుతిరిగారని ఎద్దేవా చేశారు. దీంతో బిజెపి తెలంగాణ నాయకుల ఆశలు, అంచనాలు తలకిందులయ్యాయని, వారి ముఖాలు వెలవెలబోయాయని మంత్రి అన్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం, బేగంపేట నుంచి హెలికాప్టర్ వేసుకుని వచ్చినా, జనాన్ని తరలించేందుకు, సభ ఏర్పాట్లకు ఖర్చు చేసిన కోట్లాది రూపాయలు వృధా అయ్యాయని కొప్పలు అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మునుగోడు సభకు జనం స్వచ్ఛందంగా తరలివచ్చి దిగ్విజయం చేయగా, బిజెపి వారు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున ఇచ్చి తరలించినా అమిత్ షా మాటలను జనం వినలేదని అన్నారు. కనీస స్పందన కూడా లేకుండా పోయిందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా టిఆర్‌ఎస్ అఖండ విజయం సాధించడం, గులాబి జెండా ఎగరడం ఖాయమని మంత్రి చెప్పారు.