మహారాష్ట్రలో వైద్య సిబ్బంది బర్తరఫ్
యావత్మాల్: మహారాష్ట్ర యావత్మాల్ జిల్లాలోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సుశిక్షితులైన వైద్య సిబ్బంది లేని కారణంగా ఒక మహిళ వరంగాలోనే ప్రసవించిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు, ఒక ఎఎన్‌ఎంను ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేయడంతోపాటు ఒక ఫార్మసీ అధికారి, ఇద్దరు హెల్త్ అసిస్టెంట్లు, ఒక మహిళా హెల్త్ విజిటర్‌ను సోమవారం సస్పెండ్ చేసింది. జిల్లాలోని విదుల్ పిహెచ్‌సిలో ఆగస్టు 19న సంభవించిన ఈ ఘటనలో పుట్టిన శిశువు కొద్ది సేపటికే మరణించింది. బాధిత మహిళ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ఆంబులెన్స్ లభించకపోవడంతో తన కుమార్తెను ఆటోరిక్షాలో విదుల్ పిహెచ్‌సికి తీసుకువచ్చానని, అయితే అక్కడ వైద్య సిబ్బంది ఎవరూ లేని కారణంగా తన కుమార్తె వరండాలోనే ప్రసవించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఆయన ఫిర్యాదును పురస్కరించుకునిఇ 20వ తేదీన విదుల్ పిహెచ్‌సిని సందర్శించిన జిల్లా ఆరోగ్య అధికారి ప్రహ్లాద్ చవాన్ విచారణ జరిపి వైద్య సిబ్బంది బర్తరఫ్, సెస్పెన్షన్‌లకు సిఫార్సు చేశారు. యావత్మాల్ జిల్లా పరిషద్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ అయినట్లు చవాన్ తెలిపారు.