లాన్సెట్ అధ్యయనం హెచ్చరిక
న్యూఢిల్లీ : చిన్నపిల్లలకు టొమాటో ఫ్లూ ముప్పు ఎక్కువగా ఉంటోందని, దీన్ని నియంత్రించలేకుంటే పెద్దలకు కూడా ఇది సంక్రమించి తీవ్ర పరిణామాలు ఏర్పడతాయని లాన్సెట్ అధ్యయనం హెచ్చరించింది. ది లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్ జర్నల్‌లో ఆగస్టు 17న ఈ అధ్యయనం వెలువడింది. గత మే 6 న కేరళ లోని కొల్లాం జిల్లాలో మొట్టమొదటిసారి ఈ టొమాటో ఫ్లూ లేదా టొమాటో జ్వరం బయటపడింది. జులై 26 నాటికి ఐదేళ్ల కన్నా తక్కువ వయసు చిన్న పిల్లలు 82 మందికి టొమాటో ఫ్లూ సోకింది. కేరళే కాకుండా తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లోనూ టొమాటో ఫ్లూ కేసులు బయటపడ్డాయి. చిన్నపిల్లలకు నేపీలు వాడడం వల్ల, అపరిశుభ్రమైన నేలను తాకడం, నోటిలోకి నేరుగా వస్తువులను తీసుకోవడం తదితర కారణాల వల్ల ఈ ఫ్లూ వ్యాపిస్తుంది. అరుదైన ఈ వైరల్ ఇన్‌ఫెక్షన్ సోకితే ఎర్రని, బాధపెట్టే బొబ్బలు శరీరంపై ఏర్పడతాయి. క్రమంగా వీటి సైజు పెరిగి శరీరం మంతా వ్యాపిస్తాయి. ప్రస్తుతం ఇది స్థానికంగా బలపడే స్థాయికి చేరుకుంది. ఇది ప్రాణాంతకం కానప్పటికీ కొవిడ్ 19 అనుభవం దృష్టా తదుపరి వ్యాప్తి ఎక్కువ కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అవసరమని అధ్యయనం సూచించింది. జ్వరం, అలసట, ఒళ్లంతా నొప్పులు, చర్మంపై దద్దుర్లు తదితర లక్షణాలు కొవిడ్ లక్షణాల వలె కనిపిస్తుంటాయి. అయితే వైరల్ ఇన్‌ఫెక్షన్ కన్నా చికున్‌గున్యా లేదా డెంగ్యూ జ్వరం సోకిన తరువాతనే ఈ టొమాటో ఫ్లూ ప్రభావం కనిపిస్తుందని అధ్యయనం వివరించింది. ప్రస్తుతానికి ఈ టొమాటో ఫ్లూ నివారణకు లేదా చికిత్సకు తగిన ఔషధాలు లేదా వ్యాక్సిన్లు అందుబాటులో లేవు.