న్యూఢిల్లీ: ఢిల్లీ నగరంలో 2025లోగా 80శాతం ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని సిఎం కేజ్రివాల్ తెలిపారు. రాజ్‌ఘాట్ బస్సు డిపో నుంచి 97ఎలక్ట్రిక్ బస్సులను బుధవారం జెండాఊపి కేజ్రివాల్ ప్రారంభించారు. ఢిల్లీలో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య 250కి పెరిగింది. ఇప్పటికే 1500 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చామని కొత్త ఈబస్సులు నవంబర్‌డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో 153 ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి ఉండగా కొత్తగా ప్రారంభించిన 97బస్సులతో కలిపి 250బస్సులు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. సెప్టెంబర్‌లో మరో 50కిపైగా కొత్త బస్సులు అందుబాటులోకి వస్తాయని, నవంబర్ 2023నాటికి 1800 బస్సులు ఢిల్లీ రహదారులపై ప్రయాణిస్తాయని అంచనా మొత్తం 10,380బస్సుల్లో 80శాతం వాహనాలను ఈబస్సులుగా మారుస్తామని సిఎం కేజ్రివాల్ వెల్లడించారు. 2023నాటికి ఛార్జింగ్ సౌకర్యం కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. విద్య, ఆరోగ్యం మాదిరిగానే రవాణాలో కూడా ఢిల్లీని ప్రపంచస్థాయి మోడల్‌గా తయారుచేస్తామని కేజ్రివాల్ తెలిపారు.