లిక్కర్ ఆరోపణలపై సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితకు సిటి సివిల్ కోర్టులో భారీ ఊరట దక్కింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తన ప్రమేయం ఉందంటూ ఆరోపణలు చేసిన బిజెపి నేతలపై ఎంఎల్‌సి కవిత పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఉద్దేశ పూర్వకంగా నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేసిన తన ప్రతిష్టకు భంగం కలిగించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే కవిత పిటిషన్ విచారణ జరిపిన సిటి సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితపై ఎవరూ వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించింది. బిజెపి ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎంఎల్‌ఎ మజిందర్ సిర్సాలకు సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీచేసింది. ఈ అంశానికి సంబంధించి మీడియాలో, సోషల్ మీడియాలో కూడా కవితపై ఎలాంటి వ్యాఖ్యాలు చేయవద్దని సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 13కు వాయిదా వేసింది.