Monday, December 23, 2024

బిల్కిస్ బానో కేసులో కేంద్రం, గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

- Advertisement -
- Advertisement -

Supreme Court notice to centre and Gujarat govt

11 మంది దోషుల విడుదలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో సామూహిక అత్యాచార కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషుల విడుదలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను గురువారం సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ వ్యాఖ్యలపై స్పందనను తెలియజేయాలంటూ గుజరాత్ కేంద్ర ప్రభుత్వాలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వం లోని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. అలాగే “శిక్షా కాలం తగ్గింపు ”ను పొందిన వ్యక్తుల్ని కూడా ఈ కేసులో కక్షిదారులుగా చేర్చాలని పిటిషనర్లను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసులో దోషులు గోద్రా సబ్‌జైలు నుంచి ఆగస్టు 15 న విడుదలయ్యారు. గుజరాత్ ప్రభుత్వం తన రెమిషన్ (శిక్షా కాలం తగ్గింపు ) విధానం కింద దోషుల విడుదలకు ఆదేశాలిచ్చింది. వీరి విడుదలపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. దోషుల్ని ఎలా విడుదల చేస్తారంటూ తీవ్ర స్థాయిలో నిరసనలు చేపట్టారు.

విడుదల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీపీఐ (ఎం) నేత సుభాషిణి అలీ, జర్నలిస్టు రేవతీలాల్ , సామాజిక కార్యకర్త రూపా రేఖా రాణి అత్యున్నత నాన్నయస్థానాన్ని ఆశ్రయించారు. 2002 లో గోద్రా రైలు దహన కాండ అనంతరం గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అత్యాచార ఘటన చోటు చేసుకుంది. బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని నిందితులు హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు ప్రత్యేక సిబిఐ కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. బాంబే హైకోర్టు కూడా దీన్ని సమర్థించింది. దోషులు 15 ఏళ్లు కారాగారంలో గడిపారు. అనంతరం తనను విడుదల చేయాలంటూ వారిలో ఒకడు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అతడి విజ్ఞప్తిని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కేసులో నిందితులందరికీ రెమిషన్ మంజూరు చేయాలని కమిటీ సభ్యులు సిఫార్సు చేశారు. ఈమేరకు వారి విడుదలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News