22 మంది పౌరుల దుర్మరణం
కీవ్: స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న ఉక్రెయిన్‌పై రష్యా సేనలు బుధవారం రాకెట్ దాడులు జరిపాయి. సెంట్రల్ డినిప్రోపెట్రోవస్క్ ప్రాంతంలోని చాప్టీన్ రైల్వే స్టేషన్‌పై రష్యా సేనలు జరిపిన రాకెట్ దాడిలో 22 మంది పౌరులు మరణించారు. ఈ వారంలో రష్యా తమ దేశంపై ఏదో ఒక క్రూరమైన చర్యకు పాల్పడుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ కొద్ది రోజుల క్రితం హెచ్చరించిన విధంగానే రష్యా రైల్వే స్టేషన్‌పై దాడికి పాల్పడింద. రష్యా జరిపిన దాడిని జెలెన్‌స్కీ బుధవారం రాత్రి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియచేశారు. రష్యా దాడిలో ఒక 11 ఏళ్ల బాలుడు కూడా మరణించినట్లు ఆయన తెలిపారు. ఈ సంఘటనలో దాదాపు 50 మంది గాయపడినట్లు జెలెన్‌స్కీ పేర్కొనగా ఆయన కార్యాలయంలోని ఉన్నతాధికారి ఒకరు మాత్రం 22 మంది గాయపడినట్లు వెల్లడించారు. 1991లో సోవియట్ యూనియన్ నుంచి స్వాతంత్య్రం పొందిన ఉక్రెయిన్ ఆగస్టు 24న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తోంది. ఈ సందర్భంగా బుధవారం జాతీయ సెలవు దినం ప్రకటించారు. అదీగాక బుధవారం నాటికి ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టి ఆరునెలలు కావడం గమనార్హం.