బిజెపిపై అసద్ ఆగ్రహం
హైదరాబాద్ : బిజెపిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బిజెపి ఒక ఉప ఎన్నిక కోసం ఇంత బరితెగించాలా అని మండిపడ్డారు. ఇప్పుడు బిజెపి తీరు ఇలా ఉంటే సార్వత్రిక ఎన్నికల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అగ్నికి ఆహుతి చేద్దామనుకుంటున్నారని ఆరోపించారు. ఇళ్లకు నిప్పు పెట్టి, దుకాణాలు, పాఠశాలలు మూయించి ప్రజలను ఇళ్లల్లోంచి రాకుండా కర్ఫూ సృష్టించాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. అల్లా దయతో ఇవన్నీ జరగకూడదని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. మరోవైపు పుకార్లను నమ్మవద్దని అసదుద్దీన్ ఒవైసీ ప్రజలను కోరారు. ఎంఐఎం చలో అసెంబ్లీకి పిలుపునివ్వలేదని తెలిపారు.
అలాగే ఎలాంటి నిరసన కూడా పిలుపునివ్వలేదని చెప్పారు. ఇక, గురువారం ఉదయం అసదుద్దీన్ స్పందిస్తూ గోషామహల్ ఎంఎల్‌ఎ రాజాసింగ్ చేసిన ద్వేషపూరిత ప్రసంగం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నిరసనలకు ప్రత్యక్ష ఫలితమని అన్నారు. శాలిబండా ప్రాంతం నుంచి బుధవారం 90 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, తన జోక్యం మేరకు వారిని విడుదల చేశారని అసదుద్దీన్ ట్వీట్‌లో తెలిపారు. రాజాసింగ్‌ను వీలైనంత త్వరగా జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. శాంతిభద్రతలకు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మతవాదానికి గురికాకూడదని అన్నారు. ఎంఐఎం ఎంఎల్‌ఎ అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఎంఐఎం కార్పొరేటర్లు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రాత్రంతా శ్రమిస్తున్నారని ఆయన అన్నారు.