దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థ సిటీ కళాశాల: రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి
ఘనంగా సిటీ కళాశాల శత జయంతి వేడుకలు
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ సిటీ కళాశాల అని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ కళాశాల అంతర్జాతీయ స్థాయి ప్రముఖులను, విద్యావేత్తలను, క్రీడాకారులను, సామాజిక వేత్తలను అందించిందని పేర్కొన్నారు. సిటీ కళాశాల, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో గురువారం నిర్వహించిన శత వసంతాల వేడుక మెగా ఫెస్ట్ 2022 ప్రారంభ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సిటీ కళాశాలలో చదువుకోవటం మధురమైన అనుభూతి అని పేర్కొన్నారు. విద్య అంటే కేవలం డిగ్రీలు సంపాదించటం మాత్రమే కాదని, సామాజిక స్పృహ, సాంస్కృతిక దృష్టి, చారిత్రక దృక్కోణం అలవరచుకుని దేశ పునర్నిర్మాణంలో క్రీయాశీలంగా పాల్గొనాలని చెప్పారు.
అందుకు సిటీ కళాశాలే మంచి ఉదాహరణ అని, దేశంలో ఏ ఉద్యమం జరిగినా, తొలి అడుగు సిటీ కళాశాల నుండే పడిందని గుర్తు చేశారు. ఈ స్ఫూర్తిని ఇప్పటి తరం కూడా కొనసాగించాలని ఆకాంక్షించారు. సిటీ కళాశాల భవన నిర్మాణ శైలి చార్మినార్ లాగా విలక్షణమైనదని, ఈ కళాశాల సమీపం నుండి వెళ్తుంటే చూపరులను ఆకట్టుకుంటుందని తెలిపారు. సందర్శకులకు ఒక మంచి విజ్ఞాన కేంద్రంగా అనుభూతి మిగుల్చుతుందని అన్నారు. మత సామరస్యానికి, స్నేహ సౌహార్థానికి, సమైక్య భావనకు హైదరాబాదు నగరం కేంద్రమని, సిటీ కళాశాల అందుకు ప్రేరణగా నిలిచిందని చెప్పారు.
100 గదులతో కళాశాలకు కొత్త భవనం : నవీన్ మిట్టల్
సమాజంలో ఏ రంగంలో ప్రముఖులను చూసినా తప్పనిసరిగా సిటీ కళాశాల పూర్వవిద్యార్థులు కనిపిస్తారని గౌరవ అతిధిగా పాల్గొన్న కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. ఈ వరవడికి కొనసాగింపుగా ఇటీవల లండన్‌లో జరిగిన 2022 కామన్ వెల్త్ క్రీడల్లో కళాశాల విద్యార్ధిని బేబీ రెడ్డి కాంస్య పతకం సాధించారని కొనియాడారు. ఈ కళాశాల పట్ల విద్యార్ధులకు, తల్లితండ్రులకు ఉన్న నమ్మకం దోస్త్ సీట్ల కేటాయింపు ద్వారా తెలుస్తున్నదని, ఇటీవల మొదటి విడత ప్రవేశాల్లో సిటీ కళాశాలకు అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ప్రాధాన్యతను ఇచ్చారని చెప్పారు. రాష్ట్రంలో అధిక సంఖ్యలో పిహెచ్‌డి డిగ్రీ కలిగిన ఆచార్యులు సిటీ కళాశాలలో ఉన్నారని, అందువలన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ కళాశాలకు పరిశోధన కేంద్రం కేటాయించిందని తెలిపారు. వందేళ్ల ఉత్సవాల సందర్భంగా కళాశాలకు 100 గదులతో కొత్త భవన నిర్మాణానికి అనుమతినిస్తూ అవసరమైన ఉత్తర్వులు జారీ చేశామని అన్నారు.
దేశమంతా స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ సిటీ కళాశాల శతాబ్ది వేడుకలు జరుపుకోవటం మంచి అనుభూతి అని ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ డి.రవీందర్ పేర్కొన్నారు. వందేమాతర ఉద్యమం, తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమాలలో సిటీ కళాశాల కీలక భూమిక పోషించిందని, ఈ స్ఫూర్తిని ఇప్పటి విద్యార్ధులు అందుకోవాలని సూచించారు. పాలనాదకులైన ప్రిన్సిపాల్ పర్యవేక్షణలో పరిశోధన దృష్టి కలిగిన అధ్యాపకులు సిటీ కళాశాలలో ఉండటం గొప్ప విషయమని, అందుకే ఈ కళాశాలకు మొదటిగా పరిశోధనా కేంద్రం మంజూరు చేశామని అన్నారు.
సిటీ కళాశాల నగర ఔన్నత్యానికి తార్కాణంగా నిలిచే సంస్థలలో ప్రసిద్ధమైనదని చార్మినార్ ఎంఎల్‌ఎ జనాబ్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ అన్నారు. సిటీ కళాశాల ఒక ఉద్యమ క్షేత్రం- అని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ అన్నారు. తొలిదశ తెలంగాణ ఉద్యమానికి సిటీ కళాశాల ఉద్యమ క్షేత్రంగా ప్రఖ్యాతి గాంచిందని, చదువుతో పాటు సామాజిక దృక్పధాన్ని విద్యార్థులకు కలిగిస్తుందని అన్నారు. తెలుగు సాహితీ వేత్తలు, కవులు, కళాకారులకు సిటీ కళాశాల పెట్టనికోట అని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ పి.బాల భాస్కర్ మాట్లాడుతూ, వందేళ్ల చారిత్రక సందర్భంలో తాను కళాశాలకు ప్రిన్సిపాల్ ఉండటం అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జాజ్ సుల్తానా, సీనియర్ అధ్యాపకులు ఇ.యాదయ్య, జె.రత్నప్రభాకర్‌లతో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.