Tuesday, December 24, 2024

చర్లపల్లి జైలుకు రాజాసింగ్

- Advertisement -
- Advertisement -

పిడి యాక్ట్  నమోదు.. తెలుగు రాష్ట్రాల్లో
ఎంఎల్‌ఎపై ఇదే తొలిసారి

మన తెలంగాణ/హైదరాబాద్ : గోషామహల్ ఎంఎల్‌ఎ రాజాసింగ్‌ని పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం 41 సిఆర్‌పిసి కింద మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కోరారు. కానీ గురువారం మ ధ్యాహ్నం పోలీసులు రాజాసింగ్ ఇంటికి భారీ గా చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సమాచారం తెలుసుకున్న ఆయన అభిమానులు, మద్దతుదారులు భారీగా అక్కడికి చేరుకున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందు కు గాను రాజాసింగ్‌ను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. రాజాసింగ్‌ని అరెస్టు చేయడానికి ముందు పిడి యాక్ట్ నమోదుకు సంబంధించిన నోటీసులు అందజేసినట్లుగా తెలుస్తోంది.

గతంలో రాజాసింగ్‌పై నమోదైన రెండు కేసుల విషయంలో ఆయనకు గురువారం ఉదయం మంగళ్‌హాట్, షాహినాయత్ గంజ్ పోలీసులు 41 సిఆర్‌పిసి కింద నోటీసులు జారీ చేశారు. రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయనను అక్కడ్నించి గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తైన తర్వాత పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. అంతకు ముందు రాజాసింగ్ గురువారం వీడియోను మీడియాకు విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రస్తు త పరిస్థితులకు టిఆర్‌ఎస్, ఎంఐఎంలే కారణమని రాజాసింగ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆందోళనలు, విధ్వంసాలు చేస్తున్నవారిని ఎంఐఎం నడిపిస్తుందని ఆయన ఆరోపించారు.

తనను జైల్లో పెట్టడంతో పాటు నగర బహిష్కరణ చేసేందుకు కుట్ర పన్నారని రాజాసింగ్ ఆరోపించారు. మునావర్ షో వద్దని చెప్పినా కూడా ప్రభుత్వం వినలేదని రాజాసింగ్ ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈ షో కారణంగానే హైదరాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయన్నారు. సీతాదేవి, శ్రీరాముడిని దూషించిన మునావర్ షో వద్దని చెప్పినా కూడా ఈ షోను నిర్వహించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించిందని ఆయన విమర్శించారు. ఐదు వేల మందితో ఈ షోను నిర్వహించాలని రాజాసింగ్ ఆరోపించారు. శాంతిభద్రతలు ఎందుకు క్షీణించాయో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు. తాను సోషల్ మీడియాలో గతంలో అప్‌లోడ్ చేసిన వీడియోలో మహ్మద్ ప్రవక్త గురించి ప్రస్తావించలేదని రాజాసింగ్ స్పష్టం చేశారు. పాత కేసుల్లో తనను అరెస్ట్ చేయడానికి కుట్ర చేస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. తాను అన్నింటికి సిద్ధపడి ఉన్నానని చెప్పారు.

రాజాసింగ్‌పై గతంలోనే రౌడీషీట్ : సిపి ఆనంద్

రాజాసింగ్ అరెస్ట్‌కు సంబంధించి హైదరాబాద్ సిపి సివీ ఆనంద్ స్పందించారు. 2004 నుంచి ఇప్పటివరకు రాజాసింగ్‌పై 100కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. రాజాసింగ్‌పై 18 కమ్యూనల్ కేసులు ఉన్నాయని చెప్పారు. మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రాజాసింగ్ పై గతంలోనే రౌడిషీట్ ఉందన్నారు. గత కేసుల ఆధారంగా రాజాసింగ్‌పై పిడియాక్ట్ నమోదు చేసినట్లుగా చెప్పారు. రాజాసింగ్ తరచూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని అన్నారు. మత ఘర్షణలు చోటు చేసుకునేలా రాజాసింగ్ ప్రసంగాలు ఉన్నాయని చెప్పారు. ఈ నెల 22న రాజాసింగ్ రెచ్చగొట్టేలా ఓ యూట్యూబ్ ఛానల్‌లో ఓ వీడియో పోస్టు చేశారని సివీ ఆనంద్ తెలిపారు. ఓ వర్గాన్ని కించపరిచేలా వీడియో పోస్టు చేశారని చెప్పారు. ఆ వీడియో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిందన్నారు. ఈ నెల 23న రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మరోసారి వీడియోలు విడుదల చేస్తానని రాజాసింగ్ మీడియాకు ప్రకటించారని చెప్పారు. మత విద్వేషాల ప్రసంగాల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగిందన్నారు. వీడియో కారణంగానే నిరసనలు, ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయని చెప్పారు. ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారని అన్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల రాజాసింగ్ రిమాండ్‌ని నాంపల్లి కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో రిమాండ్‌పై పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టు రాజాసింగ్ రిమాండ్‌ను తిరస్కరించడాన్ని పోలీసులు హైకోర్టులో సవాల్ చేశారు. పోలీసుల రిమాండ్ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది.

డాక్యుమెంట్‌లో కీలక విషయాలు

గోషా మహాల్ ఎంఎల్‌ఎ రాజాసింగ్ పిడి యాక్ట్ నమోదులో కీలక అంశాలు వెలుగు చూశాయి. ఈ మేరకు 32 పేజీల పీడీ యాక్ట్ డాక్యుమెంట్ రాజాసింగ్‌కు పోలీసులు అందజేశారు. రాజాసింగ్‌పై దేశవ్యాప్తంగా 101 కేసులు నమోదయ్యాయని, మత ఘర్షణలకు దారి తీసేలా రాజాసింగ్ వ్యాఖ్యలు వున్నాయని పోలీసులు పేర్కొన్నారు. మంగళ్‌హాట్, షాహినాయత్ గంజ్‌లో రాజాసింగ్‌పై రౌడీషీట్లు వున్నట్లు డాక్యుమెంట్‌లో తెలిపారు. యూట్యూబ్ ఛానెల్ ద్వారా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో పలు ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగినట్లు పేర్కొన్నారు. గతంలోనే ఘర్షణలకు తావిచ్చేలా వ్యాఖ్యలు చేయొద్దని పోలీసులు ఆయనకు సూచించారు. అయినప్పటికీ పొలీసుల సూచనలను రాజాసింగ్ పట్టించుకోలేదని పేర్కొన్నారు. పదే పదే రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో రాజాసింగ్‌పై పిడి యాక్ట్‌ను పోలీసులు నమోదు చేశారు.

అయితే రాజా సింగ్‌పై పోలీసులు పిడి యాక్ట్ నమోదు చేసిన నేపథ్యంలో ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. తరుచూ నేరాలకు పాల్పడేవారికి, పేరుమోసిన నేరస్థులను ఒక సంవత్సరం పాటు జైలులో ఉంచడానికి పోలీసులు పిడి యాక్ట్‌ను అమలు చేస్తారు. నేరస్థులు సమాజానికి ముప్పుగా పరిణమిస్తున్నారనే కారణంతో ఈ చట్టాన్ని ప్రయోగిస్తారు. అయితే పోలీసులు నమోదు చేసిన పిడి యాక్ట్‌కు సంబంధించిన వివరాలను, పిడి యాక్ట్ బోర్డు ముందు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ప్రతి మూడు నెలలకు ఒక్కసారి పిడి యాక్ట్ బోర్డు సమావేశం జరుగుతుంది. అయితే ఆ బోర్డు పిడి యాక్ట్‌ను నిర్దారిస్తే ఏడాది పాటు జైలులో ఉండే అవకాశం ఉంటుంది. మరోవైపు పిడి యాక్ట్‌ను సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది. ఇకపోతే తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక ఎంఎల్‌ఎపై పిడి యాక్ట్ నమోదవ్వడం ఇదే తొలిసారిగా తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News