‘మీ సేవ’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం
అందిస్తున్న సేవలకు గుర్తింపు
ఎకనామిక్ టైమ్స్ డిజిటెక్ కాంక్లేవ్‌లో ప్రభుత్వ పక్షాన అవార్డు అందుకున్న మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: వ్యాపారాన్ని సులభతరం చేయడం ( ఇఒడిబి)లో అత్యుత్తమ ప్రతిభ చూపిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజైన్ ‘ఎకనమిక్ టైమ్స్’ అవార్డును అందించింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అత్యుత్తమంగా ఉన్నాయని ప్రశంసించింది. గురువారం ఢిల్లీలో జరిగిన ‘డిజిటెక్ కాంక్లేవ్ 2022’లో తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కేంద్ర ప్రభు త్వ శాఖలు విడుదల చేసిన నివేదికలతో పాటు క్షేత్రస్థాయిలో జరిపిన విస్తృత పరిశోధన, అధ్యయనం ఆధారంగా రాష్ట్రానికి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు అమలుచేస్తున్న సంస్కరణలతోపాటు ‘మీ సేవ’ పోర్టల్ ద్వారా ప్రజలకు మెరుగైన డిజిటల్ సేవలను అందిస్తున్నందుకుగానూ ఈ అవార్డు వరించింది.
ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న మీసేవ(Mee Seva) కార్యకలాపాల్లో తీసుకువచ్చిన మార్పులు ముఖ్యంగా మొబైల్ ఆధారిత ప్రభుత్వ సేవలు, కాంటాక్ట్ లెస్ గవర్నెన్స్ దిశగా చేపడుతున్న కార్యక్రమాలు, టి.. వాలెట్ సాధించిన మైలురాళ్లను వివరించారు. టిఎస్ ఐపాస్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న 15 రోజులలో, టిఎస్.. బిపాస్‌లో దరఖాస్తు చేసుకున్న 21 రోజులలో అనుమతులను పొందవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న ఇఒడిబి ర్యాంకుల్లో తెలంగాణ ఎల్లప్పుడూ అగ్రస్థానంలోనే ఉందని అని అన్నారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు సిఎం కెసిఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం చేస్తున్న కృషికి ఎకనామిక్ టైమ్స్ పురసారం మరో నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విసృ్తతమైన పరిశోధన చేసిన ‘ఎకనమిక్ టైమ్స్’ పత్రికకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఐటి,పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ డా.గౌరవ్ ఉప్పల్ తదితరులు ఉన్నారు.