న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు 49 వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌవదీ ముర్ము ఆయన చేత సిజెఐగా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుత సీజెగా ఉన్న జస్టిస్ ఎన్ వి రమణ ఈనెల 26న వదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో జస్టిస్ లలిత్ సీజేఐగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ , మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు , మాజీ సీజేఐ జస్టిస్ ఎన్ వి రమణ, ప్రధాని నరేంద్రమోడీ, పలువురు కేంద్ర మంత్రులు, తదితరులు హాజరయ్యారు. అయితే లలిత్ కేవలం మూడు నెలల కన్నా తక్కువ సమయమే సీజేఐగా కొనసాగనున్నారు. నవంబర్ 8 తో జస్టిస్ లలిత్‌కు 65 ఏళ్లు పూర్తి కానుండటమే ఆయన పదవీ విరమణ చేయనున్నారు.
జస్టిస్ లలిత్ ప్రస్థానమిది….
దేశం లోనే తీవ్ర సంచలనం సృష్టించిన త్రిపుల్ తలాక్ సహా అనేక కీలక కేసుల్లో తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్ యుయు లలిత్ ఉన్నారు. 1957 నవంబరు 9న జన్మించిన ఆయన జూన్ 1983 లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. డిసెంబర్ 1985 వరకు బొంబాయి హైకోర్టులో ప్రాక్టీసు చేశారు. జనవరి 1986 నుంచి తన ప్రాక్టీస్‌ను సుప్రీం కోర్టుకు మార్చారు. 2014 ఆగస్టు 13న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. నాటి నుంచి అనేక కీలక తీర్పుల్లో భాగస్వామి అయ్యారు. త్రిపుల్ తలాక్ విధానంలో విడాకులు చెల్లుబాటు కావని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ 2017లో 32 మెజారిటీతో తీర్పు వెలువరించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ యుయు లలిత్ సభ్యుడు. కేరళ లోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం నిర్వహణ హక్కు అప్పటి రాజకుటుంబానికి ఉంటుందని జస్టిస్ యుయు లలిత్ నేతృత్వం లోని ధర్మాసనం తీర్పునిచ్చింది.