న్యూఢిల్లీ: ఓ వైపు బిజెపిపై పోరుకు సమాయత్తం అవుతున్న దశలో రాహుల్‌పై వ్యక్తిగత దూషణలు చవకబారు మాటలకు దిగుతారా? అంటూ గులాం నబీ ఆజాద్‌పై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్లుసి ) భేటీ ఆదివారం జరిగే నేపథ్యంలో నేతలు స్పందించారు. ఆజాద్ పార్టీలో 50 ఏళ్లుగా పలు పదవులు అనుభవించారు. ప్రజల కోసం, దేశం కోసం పార్టీ కోసం పలు అంశాలను విరివిగా ప్రస్తావించాల్సిన దశలో బాధ్యతను విస్మరించి ఆజాద్ ఈ విధంగా వ్యవహరించి రాజీనామాకు దిగితే ఏమనుకోవల్సి ఉంటుందని పార్టీలో యువనేత సచిన్ పైలట్ నిలదీశారు. రాహుల్ వల్లనే పార్టీలో సమిష్టి నిర్ణయాధికారం పోయిందని, ఆయన సొంతంగా చివరికి తన గార్డులద్వారా తీసుకునే నిర్ణయాలతోనే పార్టీ పరాజయం చెందుతూ పోతోందని ఆజాద్ విమర్శించారు.
దీనిపై సచిన్ ఘాటుగా స్పందించారు. రాహుల్‌ను ఎంచుకుని వేరే విధంగా చిత్రీకరించే ప్రయత్నాలకు దిగడం సబబు అన్పించుకుంటుందా? అని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికలలో పార్టీ పరాజయానికి ఏ ఒక్కరిదో బాధ్యత అన్నట్లు మాట్లాడటం చాలా తప్పని అన్నారు. గులాం నబీజీ జాన్ మిమ్మల్ని రాజ్యసభలో ప్రతిపక్ష నేత చేసింది ఎవరు? ఇతర కీలక బాధ్యతలు ఇచ్చింది ఎవరు? తెలిసి మాట్లాడండని సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఎదురుదాడికి దిగారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బివి శ్రీనివాస్ స్పందిస్తూ ఆజాద్ పలుసార్లు తమ అధికారాన్ని దుర్వినియోగపర్చారని, రాహుల్ వైఖరి బాగా లేదని అనుకున్నప్పుడు ఆయన యుపిఎ హయాంలో మంత్రిగా ఎందుకు కులికారని ప్రశ్నించారు. ఆజాద్ కేవలం వ్యక్తిగత స్వార్థంతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని, సైద్థాంతిక ఆలోచనలు ఏమీ లేవని సిడబ్లుసి సభ్యులు తారీక్ హమీద్ కర్రా విమర్శించారు. పార్టీ నేతలు విదేశాలకు వెళ్లినప్పుడు సోనియా చికిత్స జరుగుతున్నప్పుడు ఆజాద్ ఈ విధంగా చేయడం కృతజ్ఞత అన్పించుకుంటుందా? అని నేతలు ప్రశ్నించారు.
మునక పడవలో నుంచి దూకుళ్లు:కాంగ్రెస్ పరిణామాలపై బిజెపి
ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి మునిగే పడవ స్థాయికి చేరింది. దీనితోనే రణగొణధ్వనులతో పడవలో నుంచి దూకుతున్నారని బిజెపి నేత , మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు. నాగ్‌పూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇక ఆ నౌక మునక తప్పదన్నారు. ఆజాద్ లేవనెత్తిన కొన్ని అంశాలు సముచితంగానే ఉన్నాయని అన్నారు. చాలా కాలంగా పార్టీలో అంతర్గత పరిస్థితి క్లిష్టంగానే ఉంది. ఇప్పుడు ఆజాద్ విముక్తుడు అయ్యాడు. తాను ముందే అయ్యానని మరో నేత, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.
Congress Leader slams Ghulam Nabi Azad