న్యూఢిల్లీ: భారత్‌లోట్విటటర్ కార్యకలాపాలకు సంబంధించి అంతర్జాతీయ మీడియాలో వచ్చిన వార్తలకు సంబంధించి సమాచార, ప్రసారాల శాఖకు సంబంధించిన పార్లమెంటరీ కమిటీ ట్విట్టర్ అధికారులను ప్రశ్నించింది. అంతేకాకుండా డేటా సెక్యూరిటీ, వ్యక్తిగత గోప్యతకు సంబంధించి కంపెనీ అధికారులు ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో వారినితీవ్రంగా మందలించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే కంపెనీ అధికారులు మాత్రం తమ కంపెనీ మాజీ అధికారి చేసిన ఆరోపణలను తోసిపుచ్చడమే కాకుండా భారత్‌లో డేటా సెక్యూరిటీకి ఎలాంటి భంగం కలగలేదని స్పష్టం చేసింది. కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ ముందు ట్విట్టర్ సీనియర్ అధికారులు సమీరన్ గుప్తా, షగుఫ్తా కమ్రాన్ తదితరులు హాజరై తమ వాదనలను వినిపించారు. ట్విట్టర్ సంస్థ ఉద్దేశపూర్వకంగానే భారత ప్రభుత్వం తమ ఏజంట్లను కంపెనీలో నియమించడానికి అనుమతించిందని ట్విట్టర్ సెక్యూరిటీ విభాగం మాజీ చీఫ్ పీటర్ జట్కో ఆరోపించిన విషయం తెలిసిందే. కంపెనీకి చెందిన సిస్టమ్‌లు, యూజర్ డేటాను ఎలాంటి పర్యవేక్షణ లేకుండా పొందే అవకాశం ఈ ఏజంట్లకు ఉండేదని కూడా ఆయన ఆరోపించారు. అయితే అలాంటిది ఏదీ జరగలేదని ట్విట్టర్ అధికారులు పార్లమెంటరీ కమిటీకి చెప్పినట్లు ఆ వర్గాలు తెలిపాయి. జట్కో ఆరోపణలు అంతర్జాతీయ మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి.