మన తెలంగాణ/హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో దారుణం జరిగింది. అనారోగ్యంతో ఇంటికి వెళ్లి హాస్టల్‌కు ఆలస్యంగా వచ్చిన విద్యార్థినిపై హౌస్ టీచర్ అమానుషంగా ప్రవర్తించింది. పనిష్‌మెంట్ పేరుతో ఐదు రోజుల పాటు ఆ విద్యార్థినిని చిత్రహింసలకు గురి చేసింది. ఐదు రోజులు ఎనిమిది గంటలపాటు హాస్టల్ ముందు నిలబెట్టింది. దీంతో ఆ విద్యార్థిని కాళ్లు చచ్చుబడ్డాయి. అచేతన స్థితిగా నడవలేని స్థితిలో ఉన్న ఆ విద్యార్థిని చికిత్స కోసం వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వివరాల్లోకెళ్తే.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడ్డ మద్దికుంటకు చెందిన మద్దెల నిహారిక వేములవాడ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్ చివరి సంవత్సరం చదువుతోంది. ఆమె అనారోగ్యానికి గురికావడంతో ఈ నెల 18వ తేదీన ఒకరోజు సెలవు తీసుకుని ఇంటికి వెళ్లింది. ఆసుపత్రిలో చిక్సిత పొంది కాస్త రికవరీ అయిన తరువాత రెండు రోజులు ఆలస్యంగా 22వ తేదీన కళాశాలకు వచ్చింది. దీంతో మూడు రోజులు అధికంగా సెలవు తీసుకుందని తీవ్రంగా పరిగణించిన కళాశాల అధ్యాపకురాలు విద్యార్థినిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐదురోజుల నుంచి దాదాపు ఎనిమిది గంటల పాటు కాలేజీకి వెళ్లనీయకుండా హాస్టల్ బయటే నిలబెట్టింది. ఇలా వరుసగా ఐదు రోజులు పాటు విద్యార్థిని నిలబడి ఉండటంతో ఆమె కాళ్లు మొద్దుబారిపోయాయి. స్పర్శ తెలియడం లేదు. నడవలేనిస్థితిలో ఉన్న నిహారికను హాస్టల్ లోని ఆరోగ్య సిబ్బంది వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న నిహారిక తల్లిదండ్రులు అధ్యాపకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.