Monday, December 23, 2024

అవినీతి కట్టడం కుప్పకూలింది

- Advertisement -
- Advertisement -

ట్విన్‌టవర్స్ కూల్చివేతపై సందర్శకుల హర్షాతిరేకాలు
కూల్చివేతను తికించడానికి వందల సంఖ్యలో చేరిన జనం

న్యూఢిల్లీ: జీవితంలో ఒక్క సారి మాత్రమే లభించే అరుదైన అవకాశమైన నోయిడా సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేతను కళ్లారా చూడడం కోసం పెద్ద సంఖ్యలో జనం చేరడంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. అక్రమంగా నిర్మించిన ఈ ఆకాశ హర్యాలు పేకమేడల్లా కుప్పకూలుతున్న క్షణంలో అక్కడ చేరిన జనం పెద్ద ఎత్తున హర్షధ్వానాలు, కరతాళ ధ్వనులు చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ దేశంలో అవినీతిని సహించబోరనే సందేశాన్ని ఈ కూల్చివేత నిరూపించిందని పలువురు వ్యాఖ్యానించారు. కూల్చివేతకు ముందు అధికారులు కూల్చివేతలో పాల్గొంటున్న వారు తప్ప మనుషులు, జంతువులు ఏవీ రాకుండా చూడడానికి ట్విన్‌టవర్స్‌కు చుట్టుపక్కల 500 మీటర్ల పరిధిలో ప్రత్యేక జోన్‌ను ఏర్పాటు చేశారు.

బారికేడ్లు దాటుకుని ఎవరూ చొరబడకుండా చూడడం కోసం పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. కాగా ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటి అయిన ఈ కూల్చివేతను తిలకించడం కోసం నోయిడాతో పాటుగా పొరుగున ఉన్న ఢిల్లీనుంచి వందల సంఖ్యలో జనం జేపీ ఫ్లైవర్ గ్రౌండ్ వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకన్నా చాలా ముందుగానే పలువురు అక్కడికి చేరుకున్నారు. క్షణాల్లో ట్విన్‌టవర్స్ కనుమరుగయి దుమ్ముధూళిగా మారిపోతుండాన్ని చూసిన 42 ఏళ్ల పురుషోత్తం మిశ్రా ‘ అవినీతి కట్టడం కుప్పకూలినట్లుగా ఉంది’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా చాలా మంది కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించడం కోసం తాము గంటల కొద్దీ వేచి ఉన్నామని మరి కొందరు చెప్పడం విశేషం.

హోరెత్తిన ట్విట్టర్

ఓ వైపు నోయిడాలోని సూపర్‌టెక్ ట్విన్ టవర్‌స పేకమేడలా కుప్పుకూలుతుంటే మరోవైపు సామాజిక మాధ్యమం ట్విట్టర్ రకరకాల వ్యాఖ్యలు, మీమ్స్‌తో హోరెత్తిపోయింది. కొందరయితో అవినీతి టవర్ నేలమట్టమయిందని ట్వీట్ చేస్తే మరికొందరు ఇస్రో చంద్రుడి పైకి గగన్ యాన్‌ను పంపించేటప్పుడు కవర్ చేసినట్లుగా మీడియా హడావుడి కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. హాస్యం, వ్యంగ్యం,హ్యూమర్ .. ఇలా నవరసాలతో కూడిన కామెంట్స్‌తో పెట్టిన ట్వీట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే కొంతమంది మాత్రం ఇన్ని వందల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఈ భవనాలను మరి కొన్ని కోట్లు ఖర్చు చేసి కూల్చాల్సిన అవసరం ఏముందని, ఏదయినా ప్రజా సంక్షేమ అవసరాల కోసం ఈ టవర్స్‌ను ఉపయోగించుకుని ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డం గమనార్హం.

శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడే వారు దూరంగా ఉండాలి

కాగా ట్విన్ టవర్స్ కూలడం వల్ల పెద్ద మొత్తంలో దుమ్ము, ధూళి ఆ ప్రాంతంలో వ్యాపించి ఉన్నందున కూలిన ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న వారు ముఖ్యంగా శ్వాస సంబంధమైన సమస్యలతో బాధపడుతున్న వారు కొద్ది రోజులు ఆ ప్రాంతానికి దూరంగా ఉండడం మంచిదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుమారు 80 వేల టన్నుల నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలు పెద్ద ఎత్తున గాలిలో కలిసి పోయి ఉంటాయని, బలమైన గాలులు, వర్షాలు లాంటి సానుకూల వాతావరణం లేని కారణంగా 5 మైక్రాన్లు, అంతకన్నా తక్కువ పరిమాణంలో ఉండే దుమ్మ కణాలు కొద్ది రోజలు పాటు గాలిలోనే ఉండిపోయే అవకాశం ఉందని వారంటున్నారు.

దీనివల్ల కళ్లు, ముక్కు, చర్మంపై దురదలు, దగ్గు, తుమ్ములు, ఊపిరి తీసుకోవడంలో సమస్యలు, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్,ఆస్తమా సమస్యలు, గుండెకు సంబంధిత సమస్యలు తీవ్రం కావడం వంటి సమస్యలకు దారితీయవచ్చని ఢిల్లీ సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో కమ్యూనిటీ మెడిసన్ విభాగం అధిపతి డాక్టర్ జుగల్ కిశోర్ హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, ఆస్తమా, బ్రోంకటీస్ లాంటి శ్వాస సంబంధ సమస్యలతో బాధపడే వారు కనీసం 48 గంటలుఈ ప్రాంతానికి దూరంగా ఉండడం మంచిదని ఆయన సూచించారు. అలాగే చుట్టుపక్కల నివసించే ఇతరులు కూడా కొన్ని రోజలు పాటు ఎక్సర్‌సైజ్‌లకు దూరంగా ఉండాలని తెలిపారు. ఎయిమ్స్‌లో క్రిటికల్ కేర్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్ యుద్ధవీర్ సింగ్ కూడాఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

సూపర్‌టెక్‌కు రూ.500 కోట్ల నష్టం

నోయిడాలోని ట్విన్‌టవర్స్ కూల్చివేత కారణంగా తమ సంస్థకు దాదాపు రూ.500 కోట్ల నష్టం కలిగినట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన సూపర్‌టెక్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్ ఆర్‌కె అరోరా తెలిపారు. భూమిపైన పెట్టిన ఖర్చు, నిర్మాణ వ్యయం, వివిధ అనుమతులకోసం అధికారులకు చెల్లించిన చార్జీలు, ఇన్నేళ్లుగా బ్యాంకులకు చెల్లించిన వడ్డీలు, కొనుగోలు దారులకు అసలుతో పాటుగా చెల్లించిన 12 శాతం వడ్డీ అన్నీ కలుపుకొని మొత్తం నష్ట రూ.500 కోట్లకు పైగానే ఉంటుందని అరోరా చెప్పారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ ట్విన్ టవర్స్‌లోని 900కు పైగా ఉన్న అపార్ట్‌మెంట్ల విలువ రూ.700 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. కాగా నోయిడా డెవలప్‌మెంట్ అథారిటీ ఆమోదించిన ప్లాన్ ప్రకారమే తాము ఈ టవర్లను నిర్మించినట్లు ఆయన ఇప్పటికీ చెప్పడం గమనార్హం.

కాగా కూల్చివేత కోసం తాము ఎడిఫిస్ ఇం.నీరింగ్ సంస్థకు రూ.17.5 కోట్లు చెల్లిస్తున్నట్లు ఆయన చెప్పారు. మరో వైపు ఈ ట్విన్‌టవర్స్ కూల్చివేత ఫ్లాట్ల యజమానులకు గొప్ప విజయమని గృహాల కొనుగోలుదారుల సంఘం అయిన ఎఫ్‌పిసిఇ అధ్యక్షుడు అభయ్ ఉపాధ్యాయ్ అభివర్ణించారు. అంతేకాదు బిల్డర్లు, డెవలప్‌మెంట్ అధికారుల అహం( ఇగో)ను ఇది కూల్చివేసిందని కూడా ఆయన అన్నారు. కాగా ఈ కూల్చివేత రియల్టర్లకు ఒక గుణపాఠంగా నిలుస్తుందని, భవిష్యత్తులో ఎవరు కూడా నిబంధనలను అతిక్రమించకుండా ఉండేందుకు దోహదపడుతుందని క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు హర్షవర్ధన్ పటోడియా అభిప్రాయపడ్డారు. కాగా ఈ కూల్చివేత తమ ఇతర ప్రాజెక్టులపై ప్రభావం చూపదని సూపర్‌టెక్ ఒక ప్రకటనలో పేర్కొంది.

ట్విన్ టవర్స్ కూల్చివేతకు దారితీసిన క్రమం

న్యూఢిల్లీ: నోయిడాలోని సూపర్‌టెక్ కు చెందిన ట్విన్ టవర్స్‌ను ఆదివారం కూల్చివేసిన విషయం తెలిసిందే. దాదాపు వంద మీటర్లుత్తు ఉండే ఈ టవర్స్‌ను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని పేర్కొన్న సుప్రీంకోర్టు వీటిని కూల్చివేయాల్సిందిగా గత ఏడాది ఆగస్టులో ఆదేశించింది. అయితే 70 కోట్ల ఖర్చుతో నిర్మించిన ట్విన్ టవర్స్‌ను రూ.20 కోట్లు ఖర్చు చేసి

కూల్చివేయడానికి దారి తీసిన కారణాలను పరిశీలిద్దాం..

2004: నోయిడాలోని సెక్టార్ 93ఎలో నివాస గృహ సముదాయాలను నిర్మించడానికి నోయిడా అథారిటీ కేటాయించిన భూమి సూపర్‌టెక్ సంస్థకు లభించింది. అనంతరం నిర్మాణం ప్రారంభమయింది.

2005: పది ఫ్లోర్లు ఉండే 14 రెసిడెన్షియల్ టవర్స్‌ను నిర్మించడానికి సంబంధించిన బిల్డింగ్ ప్లాన్‌కు నోయిడా అథారిటీ అనుమతి లభించింది.

2006: అదనంగా మరో రెసిడెన్షియల్ టవర్‌ను నిర్మించడానికి వీలుగా బిల్డింగ్ ప్లాన్‌ను కంపెనీ సవరించింది. అనంతరం మరో రెండు సార్లు బిల్డింగ్ ప్లాన్‌ను సవరించిన కంపెనీ మొత్తం40 ఫ్లోర్లతో ఈ టవర్లను నిర్మించింది. అంతేకాదు, ఒరిజినల్ ప్లాన్ ప్రకారం టవర్స్‌ను నిర్మించిన ప్రదేశంలో గార్డెన్ చేపడతామని పేర్కొన్నారు. అయితే ఆ స్థానంలో టవర్‌ను నిర్మించారు. దీంతో అప్పటినుంచి వివాదం మొదలయింది.

2012, డిసెంబర్: చట్ట విరుద్ధంగా ట్విన్ టవర్స్‌ను నిర్మించారంటూ సూపర్‌టెక్ ఎమరాల్డ్ కోర్ట్ సొసైటీ వాసులు అలహాబాద్ హైకోర్టును ఆ్రశ్రయించారు.

2014: విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు నాలుగు నెలల్లోగా ట్విన్ టవర్స్‌ను కూల్చివేయాలని ఆదేశించింది. సూపర్‌టెక్ సంస్థతో కుమ్మక్కయినందుకు నోయిడా అథారిటీని తీవ్రంగా తప్పుబట్టింది. నిర్మాణ స్థలంలో పనులను ఆపేసింది.

2014, మే: అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సూపర్ టెక్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాము అన్ని అనుమతులు తీసుకునే నిర్మాణం చేపట్టినట్లు వాదించింది. ఈ క్రమంలో అలహాబాద్ హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా, మద్దతుగా సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

2021, ఆగస్టు: నోయిడా పాలక సంస్థ నిబంధనలను అతిక్రమించి ట్విన్ టవర్స్ నిర్మాణం చేపట్టారని గుర్తించిన సుప్రీంకోర్టు మూడు నెలల్లోగా నిర్మాణాలను కూల్చి వేయాలని ఆదేశించింది. అయితే సాంకేతిక కారణాల వల్ల ఏడాది పాటు ఆలస్యం అయింది. దీంతో సుప్రీంకోర్టు కూల్చివేత గడువును ఈ ఏడాది ఆగస్టు 28 వరకు పొడిగించింది. చివరికి ఈ రోజు(ఆదివారం) ఈ టవర్స్ నేలమట్టం అయ్యాయి.

ఆ నలుగురి సుదీర్ఘ పోరాటం

దేశంలోనే అతిపెద నిర్మాణ సంస్థల్లో ఒకటయిన సూపర్‌టెక్ సంస్థతో కోర్టుల్లో కొట్లాట వెనుక పర్యావరణ వేత్తలతో పాటుగా నలుగురు విశ్రాంత అధికారుల సుదీర్ఘ న్యాయపోరాటం ఉంది. వీరంతా ట్విన్‌టవర్స్‌లో ఉంటున్న వారే. ఈ అక్రమ కట్టడాన్ని కూల్చివేసేందుకు ఆ నలుగురు రిటైర్డ్ అధికారులు అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో దశాబ్ద కాలం పాటు అలుపెరగని పోరాటం జరిపారు. సూపర్‌టెక్ సంస్థతో పోరాడేందుకు తమ స్థోమత చాలక విరాళాలు పోగు చేపుకుని మరీ కోర్టుల చఉట్టూ తిరిగారు. వారే యుబిఎస్ టియోటియా ( 80),ఎస్‌కె శర్మ(74), రవి బజాజ్(65), ఎంకె జైన్(59). వీరంతా ఓ లీగల్ కమిటీగా ఏర్పడి సూపర్‌టెక్ సంస్థకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. వీరిలో టియోటియా సిఆర్‌పిఎఫ్‌లో డిఐజిగా పని చేసి రిటైరయ్యారు. ఈయన నేతృత్వంలోనే న్యాయపోరాటం జరిగింది. ఎస్‌కె శర్మ టెలికాం డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా రిటైరయ్యారు. కమిటీ సభ్యులో ఒకరైన జైన్ ఈ ఏడాది ఆరంభంలో కొవిడ్ కారణంగా మృతి చెందారు. ఆయన బతికుంటే కోర్టు తీర్పుతో ఎంతో సంతోషించే వారని ఆయన సతీమణి గతంలో సుప్రీంకోర్టు తీర్పు సందర్భంగా భావోద్వేగం వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News